Union Budget 2022, PM Gatishakti masterplan: రాబోయే 25 ఏళ్లను 'అమృత కాలం'గా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వర్ణించారు. ప్రస్తుత బడ్జెట్‌ వచ్చే 25 ఏళ్లకు అంకురార్పణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి ఎన్నో అవాంతరాలు ఎదురైనా భారత్‌ తట్టుకొని నిలబడిందని వెల్లడించారు. మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు సానుభూతి ప్రకటించారు. రాబోయే కాలంలో దేశాన్ని అద్భుతంగా మార్చేందుకు 'పీఎం గతి శక్తి'కి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌ ఎకానమీ, ఫిన్‌టెక్‌ కంపెనీలకు బడ్జెట్లో ప్రోత్సాహం అందిస్తున్న వెల్లడించారు.





ఏంటీ పీఎం గతి శక్తి


గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 'పీఎం గతి శక్తి' పథకాన్ని ఆరంభించారు. ఇదో మల్టీ మోడల్‌ కనెక్టివిటీ  మాస్టర్‌ ప్లాన్‌. రైల్వేస్‌, రహదారులు సహా మొత్తం 16 మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్‌ వేదిక మీదకు తీసుకొస్తారు. దేశవ్యాప్తంగా అధునాతన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాల్లో, పథకాల అమల్లో సమన్వయం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ప్రజలు, వస్తువులు, వాహనాలు ఒక చోటు నుంచి మరోచోటకు వేగంగా తరలిపోయేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చు. దేశంలోని నలు మూలలకు తక్కువ వ్యవధిలోనే ప్రయాణించేలా ఈ మౌలిక ప్రాజెక్టులు ఉంటాయి,


పీఎం దార్శనికత


ఇప్పటికే వేర్వేరు మంత్రిత్వ శాఖలు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయి. భారత్‌మాల, సాగర్‌మాల, జల మార్గాలు, రహదారులు, ఉదాన్‌ వంటివి ఒకే వేదిక మీదకు వస్తాయి. టెక్స్‌టైల్‌ క్లస్టర్లు, ఔసధ క్లస్టర్లు, రక్షణ కారిడార్లు, ఎలక్ట్రానిక్‌ పార్కులు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు, చేపల క్లస్టర్లు, అగ్రిజోన్ల నిర్మాణం, వాటి మధ్య అనుసంధానతను పెంచుతారు. దీనివల్ల భారత వ్యాపారాలు జోరందుకుంటాయి. ఇస్రో సహకారంతో సాంకేతికను ఉపయోగించుకుంటారు.


నిధులు వృథా అవ్వకుండా


సాధారణంగా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఉండదు. ఉదాహరణకు ఒక చోట రహదారి వేస్తారు. కేబుళ్లు, గ్యాప్‌ పైప్‌లైన్లు ఇతర అవసరాల కోసం ఆ రోడ్డు మళ్లీ తవ్వుతారు. దీంతో పెట్టిన శ్రమ, ఖర్చు వృథా అవుతుంది. ఇలాంటివి జరగకుండా అన్ని శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడం వల్ల డబ్బులు మిగులుతాయి. అందుకే అన్ని శాఖలను కలుపుతూ ఒక డిజిటల్‌ వేదికను ఏర్పాటు చేస్తారు. ఏవైనా పనులు చేసేముందు సమన్వయంతో అనుమతులు ఇస్తారు. దీనివల్ల ఇతర సమస్యలు రావు. పనులు త్వరగా అవుతాయి.


'అమృత కాలం' రావాలంటే!


పీఎం గతి శక్తి పథకానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోనే భారత్‌ను అత్యుత్తమ దేశంగా మార్చాలన్న ప్రధాని మోదీ సంకల్పం దీని వెనక ఉన్నట్టు ఆమె చెబుతున్నారు. గతి శక్తి పథకాన్ని సరిగ్గా అమలు చేస్తే వేగంగా ప్రయాణించడమే కాకుండా వ్యాపారాలు బాగా సాగుతాయి. దేశంలోని నలుమూలల్లో ఉన్న వ్యాపార ఉత్పత్తులు అంతర్జాతీయంగా ఎగుమతి చేయొచ్చు. అందుకే నిర్మలమ్మ ఈ పథకాన్ని బడ్జెట్‌లో నొక్కి చెప్పారు. అధికంగా నిధులు కేటాయిస్తామని సంకేతాలు ఇచ్చారు.