డిజిటల్‌ అసెట్స్‌పై పన్ను విధించడం క్రిప్టో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, ఎక్స్‌ఛేంజ్‌ వర్గాల్లో సంతోషం నింపింది! డిజిటల్‌ అసెట్స్‌ అంటే క్రిప్టో కరెన్సీయే అని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక క్రిప్టోలను భారత్‌లో చట్టబద్ధం చేసినట్టేనని సంతోషిస్తున్నారు.


30 శాతం పన్ను


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం బడ్జెట్‌-2022ను ప్రవేశపెట్టారు. డిజిటల్‌ ఆస్తులపై 30 శాతం పన్ను విధిస్తున్నామని తెలిపారు. ఒకవేళ వీటిని బహుమతిగా ఇచ్చినా స్వీకర్త పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. 'ఏదైనా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులను బదిలీ చేయడం ద్వారా వచ్చిన ఆదాయంపై 30 శాతం పన్ను ప్రతిపాదిస్తున్నాను. అలాంటి ఆదాయాన్ని గణిస్తున్నప్పుడు సొంతం చేసుకోవడానికి అయ్యే ఖర్చును తప్ప.. ఎలాంటి మినహాయింపు, అలవెన్స్‌ను ఇవ్వడం లేదు' అని ఆమె అన్నారు. డిజిటల్‌ అసెట్స్‌ ద్వారా వచ్చే నష్టాన్ని ఎలాంటి ఆదాయంపై సెటాఫ్‌ చేసేందుకు వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి లావాదేవీలను గుర్తించేందుకు  డిజిటల్‌ అసెట్స్‌ చెల్లింపులపై ఒకశాతం టీడీఎస్‌ను అమలు చేస్తామన్నారు.


అంటే చట్టబద్ధమే!


భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. వాస్తవంగా క్రిప్టోలను నిషేధిస్తారని రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. క్రిప్టో కరెన్సీ నిషేధం, నియంత్రణ బిల్లు అని దానికి పేరు పెట్టడం సర్వత్రా గందరగోళానికి గురి చేసింది. అయితే ప్రభుత్వం క్రిప్టో మైనింగ్‌ చేసే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించుకోవాలని అనుకుంటోంది. అమెరికా క్రిప్టోలపై మార్గదర్శకాలు తెచ్చేవరకు వేచిచూడాలని అనుకుంటోంది. అందుకే బిల్లు పేరును క్రిప్టో కరెన్సీ అని కాకుండా క్రిప్టో అసెట్‌గా మార్చింది. బడ్జెట్‌ సమావేశాల తర్వాత దీనిని ప్రవేశపెట్టనుంది. ఇందులో ప్రతిపాదించిన అసెట్‌.. ఇకపై పన్ను వేసే డిజిటల్‌ అసెట్‌ ఒకటేనని క్రిప్టో మార్కెట్‌ వర్గాలు అనుకుంటున్నాయి.


కాక ఇంకేటి!


'ఆదాయపన్నుపై స్పష్టత రావడం క్రిప్టో పరిశ్రమకు సంబంధించి ఒక కీలక అడుగే. క్రిప్టోలను నిషేధిస్తారన్న భయాన్ని ప్రజల్లోంచి తొలగించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని చట్టబద్ధ అసెట్‌గా చేయబోతున్నారని అర్థమవుతోంది' అని వజీర్‌ఎక్స్‌ ఇండియా సీఈవో నిశ్చల్‌ శెట్టి ఏబీపీ న్యూస్‌కు చెప్పారు. మిగతా నష్టాలకు సెటాఫ్‌ చేసుకోకుండా పన్ను విధిస్తున్నారంటే డిజిటల్‌ అసెట్స్‌ను చట్టబద్ధం చేస్తున్నారనే అర్థమని డున్‌, బ్రాడ్‌షీట్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌ డాక్టర్‌ అరుణ్‌ సింగ్ అన్నారు. నాన్‌ ఫంగీబుల్‌ టోకెన్స్‌ (NFTs)పైనా పన్ను పడనుందని అంచనా.