కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రాష్ట్రాలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాలకు ఇవ్వడానికి రూ. లక్ష కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. పైసా కూడా వడ్డీ తీసుకోకుండా.. పూర్తిగా వడ్డీ లేని రుణంగా దీన్ని అందిస్తారు. ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తారు ? ఏ అర్హతల కింద రుణాలు మంజూరు చేస్తారన్న పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎంతో  ఉపయోగపడనుంది. 


Also Read: 'అమృత కాలం'కు 'పీఎం గతి శక్తి'తో బాటలు..! రాబోయే 25 ఏళ్లకు నిర్మలమ్మ మాస్టర్‌ ప్లాన్‌!


రాష్ట్రాలు తమకు వస్తున్న ఆదాయంలో చాలా వరకూ జీతభత్యాలు.. ఇతర నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. అభివృద్ది పనుల కోసం అప్పుల మీదే ఆధారపడాల్సి వస్తోంది. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులతో సంక్షేమం పేరుతో నగదు బదిలీ పథకాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి రావడంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్పులతో ప్రణాళికేతర వ్యయం చేయాల్సి వస్తోంది. దీని ఫలితంగా ఆయా రాష్ట్రాలకు అప్పులు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. 


Also Read: 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లు: నిర్మలా సీతారామన్


ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఏం చట్టాలను సవరించాలని లేకపోతే.. అసలు అలాంటి నియంత్రణే వద్దని కేంద్రాన్ని కోరుతున్నాయి. పదే పదే అదనపు అప్పుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకునే రాష్ట్రాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కేంద్రం  రాష్ట్రాలకు రుణాలు ఇవ్వడానికి ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేయలేదు. ఆర్బీఐ ద్వారా లేదా నాబార్డ్ ద్వారా ప్రత్యేకమైన రుణాలను మంజూరు చేయడానికి సహకరించేది. కానీ ఇప్పుడు  నేరుగా రుణ నిధినే ఏర్పాటు చేసింది. 


Also Read: ఈ-పాస్‌పోర్టు ఎలా ఉంటుంది? చిప్‌లో ఏం స్టోర్‌ చేస్తారు?


కరోనా లాక్ డౌన్ సమయంలో అనేక రాష్ట్రాలు జీఎస్టీ నష్టాలకు గురయ్యాయి. జీఎస్టీ చట్టం ప్రకారం లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. కానీ అలా చేయలేదు.రుణాలు ఇప్పించింది. ఎంత లోటు ఏర్పడిందో దానికి తగ్గ నిష్పత్తిలో రుణాలిచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్రాలకు ప్రత్యేక నిధి కింద కేటాయించబోయే రూ. లక్ష కోట్లనూ అలాగే పంపిణీ చేసే అవకాశం ఉంది.