Income Tax Slab:


మధ్య తరగతి వర్గాలు, చిరుద్యోగులకు తీపికబురు! మోదీ సర్కారు వీరిపై వరాల జల్లు కురిపించింది. ఆదాయపన్ను భారం నుంచి రక్షించింది. ధరలు, నెలసరి వాయిదాల పెరుగుదల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉపశమనం కల్పించారు. మధ్యతరగతి కష్టాలు తనకు తెలుసని, వారిపై భారం తగ్గిస్తామన్న మాట నిలబెట్టుకున్నారు. అన్నట్టుగానే ఆదాయ పన్ను విధానాల్లో భారీ మార్పులు తీసుకొచ్చారు.


ఇకపై కొత్తదే!


ఇకపై సరికొత్త పన్ను విధానానికే తొలి ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారికి పడే పన్ను 'సున్నా' అని ప్రకటించారు. పన్నుల హేతుబద్దీకరణ చేపడతున్నామని వెల్లడించారు. పన్ను మదింపు ప్రక్రియను 93 నుంచి 16 రోజులకు తగ్గించామన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి ఐదు కీలక ప్రకటనలు చేశారు.



రూ.7 లక్షల వరకు 'సున్నా' పన్ను


ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త విధానంలో ఆ రిబేటు పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. అంటే ఆమేరకు ఆదాయం ఆర్జిస్తున్నవాళ్లు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.


ఆదాయ శ్లాబుల మార్పు


ఒకప్పుడు ఆరుగా ఉన్న ఆదాయ పన్ను శ్లాబులును ఇప్పుడు ఐదుకు తగ్గించారు. రూ.2.5 లక్షల శ్లాబును ఎత్తేశారు. ఇకపై రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.3 లక్షల నుంచే పన్ను మదింపు మొదలవుతుంది. రూ.3-6 లక్షల వరకు 5 శాతం, రూ.6-9 లక్షల వరకు 10 శాతం, రూ.9-12 లక్షల వరకు 15 శాతం, రూ.12-15 లక్షల వరకు 20 శాతం,రూ.15 లక్షలు మించితే 30 శాతం పన్ను రేట్లు వర్తిస్తాయి.


** ప్రకటించిన పన్ను శ్లాబులు, మినహాయింపులు వచ్చే ఆర్థిక ఏడాది నుంచి అమలవుతాయని తెలిసింది.