గత కొన్ని రోజులుగా అన్ని వర్గాలు ఎంతగానో ఎదురు చూస్తున్న టైం వచ్చింది. మరికొన్ని గంటల్లో 2023సంవత్సరానికి చెందిన పూర్తి స్థాయి బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానుంది. 2023-24ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
2023వ సంవత్సర బడ్జెట్ సందర్భంగా 23 ప్రధాన అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.
ఆదాయ పన్ను
1. పన్ను చెల్లింపుదారులు ప్రస్తుత ఉన్న పన్ను పరిమితి 2.5 లక్షల నుంచి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు మరింత మినహాయింపు ఉంటుందని ఆశిస్తున్నారు.
2. వేత జీవులు 80C కింద ఇచ్చే మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 1.5 లక్షలను రూ. 2.5 లక్షలకు పొడిగించాలని ఆశిస్తున్నారు.
3. ప్రస్తుతం ఒక వ్యక్తి రూ. 25,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంలు, ఖర్చుల కోసం మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. వైద్య ఖర్చులు పెరిగిన దృష్ట్యా పరిమితిని రూ.50 వేలకు పెంచాలని కోరుతున్నారు.
4. కొత్త పన్ను స్లాబ్ నిర్మాణంలో కొంత వెసులుబాటు ఉంటుందని అనుకుంటున్నారు. హౌస్ రెంట్, పెట్టుబడులు, బీమా ప్రీమియంలు మొదలైన వాటిపై కాస్త ఉపశమనం ఇస్తారని ఎదురు చూస్తున్నారు.
విద్యా రంగం
5. గత 50 సంవత్సరాలుగా విద్యపై జీడీపీలో 3 శాతమే ఖర్చు చేస్తున్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యపై ప్రభుత్వ వ్యయం వారి GDPలో 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. భారతదేశ పరిమాణం, జనాభా దృష్ట్యా, విద్యా రంగం GDPలో 6 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
6. అధిక-నాణ్యత గల పరిశోధన-ఇంటెన్సివ్ విశ్వవిద్యాలయాలను రూపొందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓ విశ్లేషణ. నిధులు ఉండాలని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిశోధనను బలోపేతం చేయడానికి చర్యలు.
మౌలిక సదుపాయాల రంగం
7. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల ద్వారా వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ అంచనాలు కొనసాగే అవకాశం ఉంది. PM-గతిశక్తి, జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ (NIP) లక్ష్యాలపై ఫోకస్ చేి దేశం మూలధన వ్యయాన్ని పెంచడానికి బడ్జెట్ 2023లో ప్రయత్నించ వచ్చు.
8. బడ్జెట్ 2023లో పట్టణ రవాణా, నీటి సరఫరా, పారిశుధ్యం, మురుగునీటి నిర్వహణకు నిధుల కేటాయింపు పెరగడంతో పాటు పట్టణ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని రేటింగ్ ఏజెన్సీ ICRA అంచనా వేస్తోంది.
9. డిమాండ్‌ను సృష్టించడం, ఉపాధిని సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సామర్థ్య విస్తరణకు మూలధన వ్యయం లక్ష్యం రూ. 9.0-10.5 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా.
10. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి, ద్రవ్య లోటును పరిష్కరించడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమయ్యే పరిస్థితిలో పెట్టుబడుల ఉపసంహరణ సహకారం చాలా కీలకమని నిపుణులు అంటున్నారు.
ఆరోగ్య రంగం
11. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్య సంరక్షణ రంగానికి రోగుల సమస్య పరిష్కరించడానికి , నాణ్యమైన సేవలు సరసమైన ధరల్లో పొందేందుకు వాణిజ్యపరంగా తక్కువ మూలధన-ఇంటెన్సివ్ ప్రాజెక్ట్‌లు అవసరం.
12. కరోనా తర్వాత హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ వ్యాప్తిని పెంచడానికి చర్యలు ఉండే ఛాన్స్
వ్యవసాయ రంగం
13. పంట దిగుబడులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయ-టెక్ స్టార్ట్-అప్‌లకు పన్ను ప్రోత్సాహకాలను అందించడానికి, దిగుమతి సుంకాలను తగ్గించడానికి ప్రభుత్వం PM-KISAN పథకం కింద రైతులకు ఇచ్చే నగదు సహాయాన్ని రూ. 6,000కు పెంచాలి.
14. భారతీయ వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్‌ల వంటి సాంకేతికతలను వేగంగా స్వీకరించడానికి రైతులకు, అగ్రి-టెక్ స్టార్టప్‌లకు కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది.
15. నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి, వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి జాతీయ మిషన్‌ను ప్రారంభించాలని ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ బాడీ SEA కూడా డిమాండ్ చేసింది.
రియల్ ఎస్టేట్ రంగం
16. రియల్ ఎస్టేట్ డెవలపర్లు సెక్షన్ 24 ప్రకారం గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచాలని ఆశిస్తున్నారు.
17. మూలధన లాభాల పన్ను రేటును ప్రస్తుత 20 శాతం నుంచి తగ్గించాలని కోరుతున్నారు. రెండు ప్రాపర్టీలలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి మూలధన లాభాలపై రూ. 2 కోట్ల సీలింగ్‌ను కూడా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు.
స్టార్టప్‌లు
18. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో బొమ్మలు, సైకిళ్లు, లెదర్, పాదరక్షల ఉత్పత్తికి ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం పొడిగించే అవకాశం ఉంది,
19. కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్ట్-అప్‌లతోపాటు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడిదారుల కోసం పన్ను ఫ్రేమ్‌వర్క్‌లను సరళీకరించాలి. లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల మధ్య క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు సమానంగా ఉండాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.
20. చిన్న వ్యాపారాలు తమ రోజువారీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చుకోవడంలో సహాయపడే కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)లో మార్పులు అత్యవసరమని, దీనిని 15 శాతం నుంచి 9 శాతానికి తగ్గించాలని అంటున్నారు.
ఫిన్‌టెక్ ఇండస్ట్రీ
21. జాతీయ డిజిటల్ ID వ్యవస్థను అమలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యలు ఎక్కువ మంది వ్యక్తులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో సహాయపడతాయి. తద్వారా వారు ఫిన్‌టెక్ ప్రయోజనాలను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది.
22. ఫిన్‌టెక్ సెక్టార్‌లో ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు మద్దతిచ్చే చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ ఉంది.
EV సెక్టార్
23. ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమకు చెందిన బ్యాటరీ ప్యాక్‌లు, EV భాగాలపై విధించే కస్టమ్స్ సుంకాలు, దిగుమతి సుంకాలు, GSTలో సవరణను ఆశిస్తోంది. EV బ్యాటరీల ఉత్పత్తిలో బ్యాటరీ తయారీదారులను సులభతరం చేయడానికి ప్రస్తుత 18 శాతం GSTని మినహాయించాలని డిమాండ్ ఉంది.
నిజానికి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు, ఆ తర్వాత అనేక రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ నిర్ణీత సమయంలోనే జరుగుతాయి. బడ్జెట్ పూర్తి షెడ్యూల్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
బడ్జెట్ పూర్తి షెడ్యూల్ ఇదే !
ఉదయం 8.40 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన అధికారిక నివాసం నుంచి బయటకు వచ్చి నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళతారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి బడ్జెట్ కాపీతో ఆమె పార్లమెంటుకు బయలుదేరుతారు.
ఉదయం 9 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ గేట్ నంబర్-2 నుంచి బయటకు వస్తారు. అనంతరం బడ్జెట్ తో పాటు ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక మంత్రి ఫోటో సెషన్ ఉంటుంది.
ఉదయం 9.25 - ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి బయల్దేరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి బడ్జెట్‌పై రాష్ట్రపతి ఆమోదం పొందనున్నారు. అక్కడ ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఈ సమయంలోనే ముర్ము బడ్జెట్ కు అధికారికంగా ఆమోదం తెలపనున్నారు.
ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌తో పార్లమెంటుకు చేరుకుంటారు.
ఉదయం 10.10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్న తర్వాత కేబినెట్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ కు కేబినెట్ నుంచి అధికారిక ఆమోదం తీసుకోనున్నారు.
ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై ప్రసంగిస్తారు.
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఆమె ముందుగా బడ్జెట్ ప్రకటనలపై ప్రధానాంశాలను ఇవ్వనున్నారు. అనంతరం మీడియా ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇవ్వనున్నారు.