Economic Survey 2023:


ఈ భూమ్మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక దేశం భారత్‌ అని ఆర్థిక సర్వే (Economic Survey 2023) ప్రకటించింది. ఇందుకు ఐదు అంశాలు దోహదం చేశాయని పేర్కొంది. అత్యధిక క్యాపెక్స్‌ (Capex), ప్రైవేటు వినియోగం (Private consumption), చిన్న వ్యాపార సంస్థలకు రుణాల వృద్ధి, కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్ల పటిష్ఠం, నగరాలకు వలస కార్మికుల తిరిగి రావడమేనని వెల్లడించింది. వీటన్నింట్లో క్యాపెక్సే అత్యంత కీలకమని తెలిపింది.


పెరిగిన క్యాపెక్స్‌


భారత్‌లో ఈ మధ్యన మూలధన పెట్టుబడి పెరిగింది. మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి కనీసం నాలుగు రెట్లు పుంజుకుంటుందని వెల్లడించింది. 2022-23లో క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెరిగిందని ఉదహరించింది. అంటే 35 శాతం వృద్ధిరేటని తెలిపింది. మొత్తం మూలధన పెట్టుబడిలో 67 శాతం 2022 ఏప్రిల్‌-డిసెంబర్లోనే ఖర్చు చేశారంది. 2012-2022 మధ్య క్యాపెక్స్‌ సగటున 13 శాతం పెరిగినట్టు వెల్లడించింది.


రాష్ట్రాలదీ కీలక పాత్రే


2022 జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రైవేటు క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ బాగా పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇదీ ఊతంగా మారింది. రాష్ట్రాలూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కేంద్రం తరహాలోనే ఇవీ మూలధన పెట్టుబడి ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కేంద్రం ద్వారా గ్రాంట్లు పొందుతున్నాయి. 50 ఏళ్ల పాటు చెల్లించే వడ్డీరహిత రుణాలను ఉపయోగించుకుంటున్నాయి. ఇదే సరళి కొనసాగితే 2022 బడ్జెట్‌లో చెప్పిన క్యాపెక్స్‌ లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయం.


మౌలికమే శరణ్యం!


రహదారులు, హైవేలు, రైల్వేలు, ఇళ్ల నిర్మాణాలు, పట్టణ నిర్మాణాల వంటి మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రభుత్వాలు ఎక్కువగా మూలధన పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి దీర్ఘకాలం అభివృద్ధి కారకాలుగా ఉంటున్నాయి. క్యాపెక్స్‌ వల్ల ఒకవైపు డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు ప్రైవేటు రంగంలో వినియోగానికి కారణమవుతోంది. దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరుగుదల, సరఫరాకు ఆసరాగా నిలుస్తోంది. అత్యంత పటిష్ఠమైన మౌలిక నిర్మాణాలకు పెట్టుబడులు పెట్టడం ఎకానమీ గ్రోత్‌కు కీలకమని ఆర్థిక సర్వే వెల్లడించింది.






కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో ఇదే కనిష్ఠమని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని సర్వే తెలిపింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత ఎక్కువ కాదని అలాగే పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ కాదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశం భారత్‌ మాత్రమేనని వెల్లడించింది. కొనుగోలు శక్తిలో (PPP) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని తెలిపింది. మారకం రేటు ప్రకారం ఐదో అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది.