డిజిటల్‌ అసెట్స్‌పై వచ్చే ఆదాయంపై పన్ను వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వర్చువల్‌ అసెట్స్‌ను బహుమతిగా బదిలీ చేసినప్పటికీ స్వీకర్త పన్ను కట్టాల్సి ఉంటుందని చెప్పారు. లావాదేవీలపై టీడీఎస్‌ విధిస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. డిజిటల్‌ అసెట్స్‌, వాటిపై పన్నుపై మాట్లాడాలని కోరగా ఆమె వివరణ ఇచ్చారు.


'మేం కరెన్సీపై ఎలాంటి పన్ను విధించడం లేదు. క్రిప్టోకాయిన్లు కరెన్సీ కిందకు రావు. ఆర్‌బీఐ సొంతంగా డిజిటల్‌ కరెన్సీని విడుదల చేస్తుంది. రిజర్వు బ్యాంకు పరిధిలోకి రానివన్నీ బయటి వ్యక్తులు సృష్టించిన అసెట్స్‌ మాత్రమే' అని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. 'క్రిప్టో, క్రిప్టో అసెట్స్‌ అంటే ఏంటన్న దానిపై ఇంకా చర్చించలేదు. క్రిప్టో పరిశ్రమలోని కొనుగోలు దారులు, విక్రయదారులు, ఎక్స్‌ఛేంజీ వర్గాలు, నిపుణులను సంప్రదిస్తున్నాం. సంప్రదింపులు పూర్తయ్యాకే డిజిటల్‌ అసెట్స్‌ నిర్వచనం తెలుస్తుంది' అని ఆమె వెల్లడించారు. క్రిప్టో అసెట్స్‌ చట్టం తెచ్చేంత వరకు చట్టబద్ధత లేనట్టేనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.






30 శాతం పన్ను


బడ్జెట్‌ ప్రసంగంలో డిజిటల్‌ ఆస్తులపై 30 శాతం పన్ను విధిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఒకవేళ వీటిని బహుమతిగా ఇచ్చినా స్వీకర్త పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. 'ఏదైనా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులను బదిలీ చేయడం ద్వారా వచ్చిన ఆదాయంపై 30 శాతం పన్ను ప్రతిపాదిస్తున్నాను. అలాంటి ఆదాయాన్ని గణిస్తున్నప్పుడు సొంతం చేసుకోవడానికి అయ్యే ఖర్చును తప్ప.. ఎలాంటి మినహాయింపు, అలవెన్స్‌ను ఇవ్వడం లేదు' అని ఆమె అన్నారు. డిజిటల్‌ అసెట్స్‌ ద్వారా వచ్చే నష్టాన్ని ఎలాంటి ఆదాయంపై సెటాఫ్‌ చేసేందుకు వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి లావాదేవీలను గుర్తించేందుకు  డిజిటల్‌ అసెట్స్‌ చెల్లింపులపై ఒకశాతం టీడీఎస్‌ను అమలు చేస్తామన్నారు.