ఈ దేశంలో అత్యంత నిజాయతీగా పన్నులు కట్టేది ఉద్యోగులే! సంపాదించేదే కొంత.. అందులోనూ పన్నుల మోత! అందుకే ఈ ఏడాది బడ్జెట్‌పై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా కోరికలు విన్నవించుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అవేమీ పట్టించుకోనట్టే కనిపించింది! ఆదాయపన్ను పరంగా ప్రజలు ఏం అడిగారో, నిర్మలమ్మ ఏం వడ్డించిందో ఓసారి చూద్దాం!!


పన్ను శ్లాబులు


ఏం అడిగాం: వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను ప్రభుత్వం 2014లో సవరించింది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంచారు. సీనియర్‌ సిటిజన్లకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. మళ్లీ పెంచలేదు.  నిర్మలా సీతారామన్‌ ఈ సారి పన్ను శ్లాబులను రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని అంతా విన్నవించారు.


ఏం వడ్డించింది: ఆదాయపన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త ఎలాంటి మినహాయింపులూ ప్రకటించలేదు. పాతవాటినే యథాతథంగా కొనసాగిస్తున్నారు.


కొత్త విధానంపై స్పష్టత


ఏం అడిగాం: గతేడాది రెండు పన్ను విధానాలు ప్రవేశపెట్టారు. రెండో విధానంలో సెక్షన్‌ 80C తరహాలో ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయ వర్గాలకు కొత్త, పాత పన్ను విధానాల్లో మినహాయింపు ఉంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయ వర్గాలు రెండు విధానాల్లోనూ 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్పష్టత కావాలని కోరాం.


ఏం వడ్డించింది: నిజానికి  రెండో విధానంలో సర్‌ఛార్జులు విధించడంతో కట్టాల్సిన పన్ను ఎక్కువే అవుతోంది. పైగా ఎలాంటి మినహాయింపులు లేవు. దానికి ప్రోత్సహించేందుకు ఎలాంటి ఇన్సెంటివ్‌ ప్రకటించలేరు.


స్టాండర్డ్‌ డిడక్షన్‌


ఏం అడిగాం:  ఇప్పుడు వ్యక్తిగత నికర పన్ను ఆదాయం రూ.5 లక్షలకు వరకు సెక్షన్‌ 87A కింద రెండు పన్ను విధానాల్లో రూ.12,500 వరకు రిబేటు ఇస్తున్నారు. అంటే రూ.5 లక్షల లోపు వారిపై పన్ను భారం సున్నా మాత్రమే. కరోనా నేపథ్యంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.100000  పెంచాలని డిమాండ్‌ చేశారు.


ఏం వడ్డించింది: స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపుపై అసలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంటే డిడక్షన్‌ రూ.50వేలే ఉంటుంది.



సెక్షన్‌ 80C పరిధి పెంపు


ఏం అడిగాం: 2014 నుంచి సెక్షన్‌ 80C కింద మినహాయింపులను పెంచలేదు. గతంలో రూ.లక్షగా ఉన్న డిడక్షన్లను రూ.1.5 లక్షలు, ఇంటి రుణంపై వడ్డీ మినహాయింపును రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈసారి వీటిని వరుసగా రూ.2 లక్షలు, రూ.2.50 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌కు సెక్షన్‌ 80CCD కింద అదనంగా రూ.50వేలు, బీమా ప్రీమియం డిడక్షన్‌ను రూ.15000 నుంచి రూ.25,000 పెంచడం కాస్త ఊరట. ఇంకా పెంచితే బాగుంటుందని ఆశ.


ఏం వడ్డించింది: ఈసారీ 80C కింద ఎలాంటి మినహాయింపులను పెంచలేదు. మొత్తంగా రూ.1,50,000 ఉంటుంది. ఇంటి రుణంపై వడ్డీ మినహాయింపుపైనా ప్రకటనేమీ చేయలేదు. అంటే రూ.2 లక్షలుగానే ఉంటుంది. ఎన్‌పీఎస్‌ జమ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల మధ్య బేధాన్ని తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను మినహాయింపు పరిమితిని 14శాతానికి పెంచారు. దివ్యాంగుల తల్లిదండ్రులు, సంరక్షకుడు తీసుకొనే బీమా, బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు ఇచ్చారు.


హేతుబద్ధీకరణ


ఏం అడిగాం:  ఈ సారి ఆదాయపన్నును మరింత సరళీకరించాలని, హేతుబద్ధీకరించాలని డిమాండ్లు ఉన్నాయి. 2020-21 బడ్జెట్‌లో దాదాపుగా 70 మినహాయింపులు, డిడక్షన్లను తొలగించారు. రాబోయే సంవత్సరాల్లో మిగిలిన మినహాయింపులను హేతుబద్ధీకరిస్తామని నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. టీడీఎస్‌, టీసీఎస్‌ వంటివీ సరళీకరిస్తే మరింత బాగుంటుంది.


ఏం వడ్డించింది: సర్‌ఛార్జ్‌ హేతుబద్ధీకరణ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పన్ను చెల్లింపు దారులకు ఒక ఊరట కల్పించారు. ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా మార్చుకొనేందుకు రెండేళ్ల సమయం ఇచ్చారు. అంటే అసెస్‌మెంట్‌ ఇయర్‌ నుంచి రెండేళ్ల వరకు అన్నమాట.


WFH అలవెన్సులు


ఏం అడిగాం: ఈ ఏడాది బడ్జెట్‌లో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు పన్ను ఆకర్షించని WFH అలవెన్సులను ప్రకటించాలని, ఇంటి ఖర్చులపై మినహాయింపులు పెంచాలని, సాలరీ స్ట్రక్చర్‌లో ఉద్యోగులకు మేలు చేయాలని కోరారు.


ఏం వడ్డించింది: ఎలాంటి అలవెన్సులు ప్రకటించలేదు. సాలరీ స్ట్రక్చర్‌ జోలికే వెళ్లలేదు.