కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజల వద్ద నుంచి పన్నులను పిండుకోవడం తప్ప.. ఏ ఒక్క రంగానికి చేయూత ఇచ్చే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల భారంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లే భారీ విజయంగా చెప్పుకుంటోంది. ఇక్కడే ప్రభుత్వ ఆలోచనా ధోరణి స్పష్టమవుతోంది. కేవలం వారు సంపదను మాత్రమే చూస్తున్నారు. సామాన్యుల బాధలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 


 



నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నుల కోసం మాత్రమేనని పేదలకు..  మధ్యతరగతి వారికి ఏ మాత్రం ఉపయోగం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. 



ఈ బడ్జెట్‌తో మరో పాతికేళ్లయినా అచ్చేదిన్ కోసం సామాన్య ప్రజలు ఎదురు చూడాల్సిందేనని ఎంపీ శశిధరూర్ వ్యాఖ్యానించారు. 



కరోనా కష్టకాలంలో ప్రజలు ఆకలితో అలమటిస్తూ కేంద్రం ఆహారంపై పెట్టే ఖర్చును తగ్గిస్తూ పోతోందని ఇది దుర్మార్గమని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరీ విమర్శించారు. ఇది ధనవంతుల బడ్జెట్ అన్నారు.



సామాన్యుల కోసం.. పేదల కోసం పైసా కూడా కేటాయించని పెగాసస్ స్పిన్ బడ్జెట్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.