Interim Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు (2024 ఫిబ్రవరి 01) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పిస్తారు. మరికొన్ని నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్.
బడ్జెట్‌ను బాగా అర్థం చేసుకోవాలంటే.. కొన్ని కీలక పదాలు, వాటి అర్ధాలు, ఆ పదాలను ఉపయోగించే సందర్భాల గురించి తెలియాలి. అవి:
ఫైనాన్స్ బిల్(Finance Bill): కొత్త పన్నుల విధింపు లేదా పన్ను నిర్మాణంలో మార్పులు లేదా ప్రస్తుత పన్నుల విధానాన్ని కొనసాగించే ప్రకటనలో ఈ పదాలను నిర్మలమ్మ ఉపయోగిస్తారు. తెలుగులో ఆర్థిక బిల్లుగా పిలుస్తారు.
యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్‌మెంట్: ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, వ్యయాలు ఈ స్టేట్‌మెంట్‌లో ఉంటాయి. తెలుగులో దీనిని వార్షిక ఆర్థిక ప్రకటన అని అంటారు.
ఫిస్కాల్ పాలసీ: దేశ ఆర్థిక స్థితిని పర్యవేక్షించే ఆర్థిక విధానం ఇది. ప్రభుత్వానికి వచ్చే పన్నులు, వ్యయాల అంచనా ఇది. తెలుగులో ఆర్థిక విధానం అంటారు.
ఫిస్కాల్ డెఫిసిట్: మార్కెట్ రుణాలను మినహాయించి, ప్రభుత్వ వ్యయం ఆదాయాన్ని మించి ఉంటే ద్రవ్య లోటు (ఫిస్కాల్ డెఫిసిట్) అంటారు. GDPలో శాతంగా దీనిని లెక్కిస్తారు. ప్రభుత్వ వ్యయాలు, మొత్తం ఆదాయాల మధ్య ఉండే అంతరం ఇది. తెలుగులో ఆర్థిక లోటుగా పిలుస్తారు.
డైరెక్ట్ టాక్సెస్: పన్ను చెల్లింపుదార్ల నుంచి నేరుగా వసూలు చేసే ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి వాటిని డైరెక్ట్ టాక్సెస్ లేదా ప్రత్యక్ష పన్నులు అంటారు.
ఇన్ డైరెక్ట్ టాక్సెస్: ప్రజల నుంచి నుంచి పరోక్షంగా వసూలు చేసే GST, వ్యాట్ (VAT), కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, సర్వీస్ టాక్స్ వంటి వాటిని ఇన్ డైరెక్ట్ టాక్సెస్ లేదా పరోక్ష పన్నులు అంటారు.
రెవెన్యూ రిసిప్ట్స్: ఆదాయాల సృష్టికి ఉపయోగపడని ప్రతీది రెవెన్యూ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. ఉదా.. జీతాలు, రాయితీలు, వడ్డీ చెల్లింపులు.
రెవెన్యూ డెఫిసిట్: ప్రభుత్వానికి వచ్చే మొత్తం రెవెన్యూ రాబడుల కంటే, ప్రభుత్వం చేసే మొత్తం రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే, దానిని రెవెన్యూ లోటు లేదా రెవెన్యూ డెఫిసిట్ అంటారు.
క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్: అభివృద్ధి, కొనుగోళ్లు లేదా యంత్రాలు/ఆస్తుల క్షీణత కోసం ప్రభుత్వం కేటాయించే డబ్బును మూలధన వ్యయం లేదా క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ అంటారు.
కన్సాలిడేటెడ్ ఫండ్: ప్రభుత్వం తీసుకునే రుణాలు, వాటిపై వడ్డీలు అన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో ఉంటాయి. ఆకస్మిక నిధిలోని (Contingency Fund) అంశాలు తప్ప ప్రభుత్వ వ్యయం మొత్తం ఈ ఫండ్ నుంచే జరుగుతుంది.
కాంటింజెన్సీ ఫండ్: ఊహించని/ఆకస్మిక వ్యయాల కోసం ఈ ఫండ్ కింద కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. పార్లమెంటు ముందస్తు ఆమోదంతో ఈ ఫండ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తారు, ఆ తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తిరిగి చెల్లిస్తారు.
మరో ఆసక్తికర కథనం: 2024-25 తాత్కాలిక బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం- ఆరోసారి ప్రవేశపెట్టనున్న నిర్మల