Budget 2023: 


వచ్చే బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిధి పెంచాలని ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు. సెక్షన్‌ 80 పరిధిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. బడ్జెట్‌ లోటుతో పోలిస్తే పన్ను మినహాయింపులకే మరింత ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారని ఆర్థిక ప్రణాళికల అంకుర సంస్థ కువేరా తెలిపింది. తాము నిర్వహించిన సర్వేలో ప్రతి ముగ్గురులో ఇద్దరు ఇలాగే స్పందించారని వెల్లడించింది.


ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ వేదిక 'కువేరా' జనవరి మొదటి వారంలో ఓ పోల్‌ నిర్వహించింది. కేంద్ర బడ్జెట్‌-2023 నుంచి ఏం కోరుకుంటున్నారో ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వేదికలో 16 లక్షల మంది వరకు యూజర్లు ఉన్నారు. 'సెక్షన్‌ 80సీ పరిధిని రూ.1.5 లక్షల నుంచి రెట్టింపు చేయాలని ఎక్కువ మంది యూజర్లు స్పందించారు. ప్రస్తుత పరిధిని 2014లో సవరించారు. ఈ బడ్జెట్‌లో కచ్చితంగా లిమిట్‌ పెంచాలని కోరుకుంటున్నారు' అని కువేరా సహ వ్యవస్థాపకుడు గౌరవ్‌ రస్తోగి అన్నారు.


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఉపయోగపడే బడ్జెట్‌నే రూపొందిస్తారని ఎలారా క్యాపిటల్‌ అంచనా వేస్తోంది. కొవిడ్‌ 19 నష్టాలు, పెరిగిన కమొడిటి ధరలు, పెంచుతున్న వడ్డీరేట్లు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత పరిస్థితులే ఇందుకు కారణాలని వెల్లడించింది. ఎన్నికల ఏడాదికి ముందు బడ్జెట్‌ కావడంతో సామాన్యులపై వరాల జల్లు కురిపిస్తారని మరికొందరు అంచనా వేస్తున్నారు.


'దేశ బడ్జెట్‌ లోటు కన్నా పన్ను ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఆర్ధిక మాంద్యం ఆందోళన దృష్ట్యా పన్నుల నుంచి ఉపశమనం కల్పించాలని, ఎక్కువ ఆదా చేసుకొనేలా ప్రోత్సహించాలని భావిస్తున్నారు' అని గౌరవ్‌ రస్తోగి తెలిపారు.


సర్వే ఫలితాలు ఏంటంటే?



  • ప్రతి ముగ్గురులో ఇద్దరు సెక్షన్‌ 80సీ పన్ను మినహాయింపులను రెట్టింపు చేయాలని కోరుకున్నారు. రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని అంటున్నారు.

  • రెగ్యులర్‌ నుంచి డైరెక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు మారడాన్ని పన్ను రహితంగా మార్చాలి. ప్రతి పది మందిలో ముగ్గురు దీనికి ఓటేశారు.

  • బడ్జెట్‌ లోటును 5 శాతం దిగువకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. పన్ను చెల్లింపు దారులకు మాత్రం దీనికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

  • ప్రతి పది మందిలో ఒక్కరు బడ్జెట్‌ లోటును 5 శాతం దిగువకు తీసుకురావాలని కోరుకున్నారు.