Budget 2023: నేడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్- 2023 ను ప్రవేశపెట్టారు. దీనిలో అన్ని వర్గాలకు సమన్యాయం చేశారు. రైతులు, మహిళలు, సామాన్య ప్రజల కష్టాలు తీరేలా పద్దును తీర్చిదిద్దారు. అలాగే మధ్య తరగతి వర్గాలు, చిరుద్యోగులకు తీపికబురు! మోదీ సర్కారు వీరిపై వరాల జల్లు కురిపించింది. ఆదాయపన్ను భారం నుంచి రక్షించింది. ధరలు, నెలసరి వాయిదాల పెరుగుదల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపశమనం కల్పించారు. మధ్యతరగతి కష్టాలు తనకు తెలుసని, వారిపై భారం తగ్గిస్తామన్న మాట నిలబెట్టుకున్నారు. అన్నట్టుగానే ఆదాయ పన్ను విధానాల్లో భారీ మార్పులు తీసుకొచ్చారు.
రూ.7 లక్షల వరకు 'సున్నా' పన్ను
ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త విధానంలో ఆ రిబేటు పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. అంటే ఆమేరకు ఆదాయం ఆర్జిస్తున్నవాళ్లు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
ఆదాయ శ్లాబుల మార్పు
ఒకప్పుడు ఆరుగా ఉన్న ఆదాయ పన్ను శ్లాబులును ఇప్పుడు ఐదుకు తగ్గించారు. రూ.2.5 లక్షల శ్లాబును ఎత్తేశారు. ఇకపై రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.3 లక్షల నుంచే పన్ను మదింపు మొదలవుతుంది. రూ.3-6 లక్షల వరకు 5 శాతం, రూ.6-9 లక్షల వరకు 10 శాతం, రూ.9-12 లక్షల వరకు 15 శాతం, రూ.12-15 లక్షల వరకు 20 శాతం,రూ.15 లక్షలు మించితే 30 శాతం పన్ను రేట్లు వర్తిస్తాయి.
వైరల్ గా 1992 పన్ను స్లాబ్ ఫోటో
పన్ను సవరింపుల నేపథ్యంలో సోషల్ మీడియాలో 1992 పన్ను రేట్ల ఒకటి వైరల్ అవుతోంది. 1992 నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని దేశంలో సరళీకరణ పితామహుడిగా పిలుస్తారు. రావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బడ్జెట్‌ను సమర్పించారు. ఇది దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం చూపించింది. ఈ బడ్జెట్‌లో పన్ను శ్లాబును 3 భాగాలుగా విభజించారు. @IndiaHistorypic అనే ట్విట్టర్ హ్యాండిల్ అప్పటి పన్ను చిత్రం అప్ లోడ్ చేసి ఉంది. ఈ చిత్రంలో 1992 నాటి పన్ను స్లాబ్ గురించి సమాచారం ఉంది.
ఈ బడ్జెట్ లో మహిళల కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ 'మహిళా సమ్మాన్ పొదుపు లేఖ' (మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్) పథకాన్ని ప్రకటించారు. బడ్జెట్‌లో మహిళలకు ఇది అతిపెద్ద ప్రకటన. ఈ పథకం కింద మహిళలెవరైనా 2 సంవత్సరాలు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి. మెచ్యురిటీ అనంతరం ఆ సొమ్ముతో పాటు వడ్డీని ప్రభుత్వం మహిళలకు అందిస్తుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్ పథకం
- దేశంలోని మహిళలు, బాలికలు ఎవరైనా ఈ పథకం కింద ఖాతా తెరవచ్చు.
- 2 సంవత్సరాలు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి
- మెచ్యురిటీ అయ్యాక ఆ సొమ్ముకు 7.5 శాతం వడ్డీని ప్రభుత్వం అందిస్తుంది.
- మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిపి మొత్తం సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు.
- ఒకవేళ డిపాజిట్ చేసిన మహిళ మరణిస్తే నామినీకి ఆ డబ్బును అందిస్తారు.
- నిబంధనలు, షరతులు ప్రకారం అకౌంట్ ఓపెన్ చేయాలి.
ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు, మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. స్వావలంబన దిశగా మహిళలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ స్కిల్ హానర్ స్కీమ్ కింద మరింతమందిని తీసుకురావడం గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.