Election Budget :   మోదీ ప్రభుత్వం అత్యంత కీలకమైన ఎన్నికల ఏడాదిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్లలో ఇలాంటి ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారు. ఈ సారి కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. ప్రజలకు కొన్నిఉపశమనాలు ప్రకటించడం ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ఎజెండాను ఖరారు చేసింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం ఇవ్వడంతో పాటు, ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన బడ్జెట్‌ను కూడా పెంచింది. ఇప్పుడు పాత ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేశామని, కొత్త విధానంలో 7 లక్షల వరకు ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.


ప్రజలను ఆకట్టుకునేందుకు పలు పథకాలకు నిధుల పెంపు 


దేశంలో ఎనిమిది కోట్ల మంది పన్నులు చెల్లిస్తుండగా, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వీరి సంఖ్య దాదాపు 1 కోటి 33 లక్షలకు చేరువలో ఉంది. పన్ను తగ్గించిన విధానం ప్రకారం, ప్రజలు గరిష్టంగా రూ.33,800 వరకు ప్రయోజనం పొందనున్నారు. దీని వల్ల నేరుగా పన్ను చెల్లింపుదారులకే కాకుండా, చేతిలో డబ్బు పెరిగితే వినియోగం కూడా పెరుగుతుందన్నది సుస్పష్టం. దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతోపాటు ఉపాధి మార్గాలు కూడా పెరుగుతాయి. ఎన్నికలకు ముందు పన్ను మినహాయింపు అనేది మోడీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం, ఇది ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చబోతోంది. దీనితో పాటు, 2015 సంవత్సరంలో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై మోడీ ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచింది. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం విజయం సాధించడంలో ఈ పథకం పెద్ద పాత్ర పోషించింది.


ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు పెద్ద పీట 


గత బడ్జెట్ కంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 66 శాతం ఎక్కువ కేటాయింపుల ుచేశారు. 2022-23 సంవత్సరంలో ఈ పథకంలో రూ.48 వేల కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో రూ.79 వేల కోట్లు కేటాయించారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక పథకం. ప్రభుత్వం నుంచి అందిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ పథకం కింద 2.95 కోట్ల మందికి ఇళ్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 2.49 కోట్ల మంది దీని ద్వారా లబ్ధి పొందారు. దీంతో 2022 డిసెంబర్‌లో 2.10 కోట్ల ఇళ్లను నిర్మించారు. ఈ పథకం ప్రభావం వల్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలు బీజేపీకి భారీగా ఓటు వేశారు. మోడీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలతో పాటు  ఈ ఏడాది మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుని బడ్జెట్‌ను రూపకల్పన చేసిందని అనుకోవచ్చు. 


విపక్షాల అసంతృప్తి !


 మోడీ సర్కార్ ఈ బడ్జెట్ పట్ల విపక్ష నేత సంతోషం వ్యక్తం చేయడం లేదు.  'రైతుng, జవాన్‌, యువతకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేవని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది.   బిజెపి బడ్జెట్ ద్రవ్యోల్బణం,  నిరుద్యోగం రెండింటినీ పెంచుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలష్ యాదవ్ విమర్శించారు.  రైతులు, కూలీలు, యువత, మహిళలు, ఉద్యోగ నిపుణులు, వ్యాపార వర్గాల్లో ఆశలకు బదులు, నిరుత్సాహమే పెరుగుతోంది, ఎందుకంటే ఇది కేవలం కొంతమంది పెద్ద వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.