Union Budget 2023 : కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను శ్లాబ్ సామాన్యుడికి ఆశాజనకంగా ఉందని చెప్పారు.  ఏడు ముఖ్యమైన  అంశాలకు  బడ్జెట్ లో  కేటాయింపులు  చేసినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.  కొన్ని కేటాయింపులు  సంతృప్తినిచ్చినట్టుగా ఏపీ ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. కొవిడ్ తో దేశమంతా అల్లాడిందని కేంద్రం శ్రమపడుతుందంటే రాష్ట్రాలు కూడా పడుతున్నట్టేనని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఉపయోగపడే బడ్జెట్ అని కితాబుచ్చారు.  


రైల్వే బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయ్ 


గతేడాది 6.4 శాతం ద్రవ్యలోటు ఉండగా, ఇప్పుడది 5.9 శాతానికి తగ్గిందని.. ఇది శుభపరిణామం అన్నారు. రైల్వేలు, రోడ్లలో మౌలిక వసతులపై బడ్జెట్ లో అధిక భారీగా నిధులు  కేటాయించారన్న ఆయన..వ్యవసాయం, పౌరసరఫరాలపై కేటాయింపులు  తగ్గినట్టుగా కనిపిస్తుందన్నారు. యూరియా సబ్సిడీ, వ్యవసాయపరమైన సబ్సిడీలు తగ్గినట్టు కనిపిస్తున్నాయని బుగ్గన వెల్లడించారు. గతేడాది యూరియా సబ్సిడీ రూ.1.54 లక్షల కోట్లు ఉండగా, ఈసారి రూ.1.31 లక్షల కోట్లు కేటాయించారని చెప్పారు. రైల్వే బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని, గతేడాది రూ.1.89 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.  రైల్వే స్టేషన్ల వసతులకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోందని చెప్పారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ఓ థీమ్ ప్రకారం రూపొందిస్తున్నారని, ఈసారి 7 ప్రధాన అంశాలను ప్రతిపాదికగా చేసుకుని బడ్జెట్ రూపకల్పన చేశారని వివరించారు.


7 అంశాలపై ఫోకస్ 


బడ్జెట్లో 7 అంశాలపై ఫోకస్ పెడుతున్నట్టు  ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్‌. పీఎం మత్య్స సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. త్వరలోనే భారత్...తృణధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుంది. మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి. త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. గ్రామీణ మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధి జరిగిందని చెప్పారు. భవిష్యత్‌లో ఈ సాయం ఇంకా పెరుగుతుందని హామీ ఇచ్చారు. ఆత్మ నిర్భరత భారత్‌కు ఇది నిదర్శనమని నిర్మలా చెప్పుకొచ్చారు.  గ్రామీణ మహిళలకు సాయం చేయడమే కాదు. వారు నైపుణ్యాలు పెంచుకునేందుకూ తోడ్పడుతున్నామని వివరించారు. సామాజిక భద్రతనూ కల్పిస్తున్నామన్నారు కేంద్ర ఆర్థికమంత్రి.