Budget 2022 Sensex Market Live : స్టాక్‌ మార్కెట్లో బుల్‌ జోష్‌! సెన్సెక్స్‌ 800 +, నిఫ్టీ 200+

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. స్టాక్‌ మార్కెట్లలో జోరు మామూలుగా ఉండదు. మదుపర్లు భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. నిరాశ కలిగిస్తే నష్టాలు కూడా అదే రీతిలో ఉంటాయి.

ABP Desam Last Updated: 01 Feb 2022 10:44 AM
ఎంత పన్ను వసూలు చేశారంటే?

ఇప్పటి వరకు LTCG ద్వారా 2018-19లో రూ.1222 కోట్లు, 2019-20లో రూ.3460 కోట్లు, 2020-21లో రూ.5314 కోట్ల ఆదాయం వచ్చింది.

LTCG రద్దు చేస్తారా?

2018లో దీర్ఘకాల మూలధన రాబడిపై పన్ను అమలు చేస్తున్నారు. షేర్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది వరకు దగ్గరుంచుకుంటే ఈ పన్ను విధిస్తారు. షేర్లపై రూ.లక్షకు పైగా LTCG వస్తే పది శాతం పన్ను వేస్తున్నారు. ఇండెక్సేషన్‌ ప్రయోజనం కూడా లేదు. మార్కెట్‌ వర్గాలు ఈ హోల్డింగ్‌ పిరియడ్‌ను రెండేళ్లకు పెంచాలని, లేదా రద్దు చేయాలని కోరుకుంటున్నాయి.

ఆర్ధిక సర్వే ఇచ్చిన ఊపు

స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఆర్థిక సర్వే నివేదిక ఇచ్చిన దన్నుతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు.

నిఫ్టీ 240+

సోమవారం 17,339 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,529 వద్ద మొదలైంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో 240 పాయింట్ల లాభంతో 17,580 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్ 800+

క్రితం రోజు 58,014 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,672 వద్ద భారీ లాభాల్లో ఆరంభమైంది. ప్రస్తుతం 863 పాయింట్ల లాభంతో 58,868 వద్ద ఉంది.

Background

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లలో జోరు మామూలుగా ఉండదు. మంచి బడ్జెట్‌ వస్తుందన్న ధీమాతో మదుపర్లు భారీగా కొనుగోళ్లు చేపడుతున్నారు. ఒకవేళ నిరాశ కలిగిస్తే నష్టాలు కూడా అదే రీతిలో ఉంటాయి.


నిన్న ఏం జరిగిందంటే!


బడ్జెట్‌ ముందు రోజు భారత స్టాక్‌ మార్కెట్లు కళకళలాడాయి. 2023 ఆర్థిక ఏడాదిలో జీడీపీని 8-8.85 శాతంగా అంచనా వేయడం, బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చే చర్యలు ఉంటాయన్న సంకేతాలు, ఆసియా, ఐరోపా మార్కెట్లు మెరుగ్గా ఓపెనవ్వడం ఇందుకు దోహదం చేశాయి. ఉదయం నుంచీ బెంచ్‌మార్క్‌ సూచీలు గరిష్ఠ స్థాయిల్లోనే కదలాడాయి.  ఒకానొక దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 900+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270+ వరకు లాభాల్లో ఉండటం గమనార్హం.


శుక్రవారం 57,200 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సోమవారం 57,845 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. వెంటనే 58,125 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఇంట్రాడే కనిష్ఠమైన 57,746ను తాకిన సూచీ మళ్లీ పుంజుకొని 58,257 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 813 పాయింట్ల లాభంతో 58,014 వద్ద ముగిసింది.


శుక్రవారం 17,101 వద్ద ముగిసిన ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,301 వద్ద గ్యాప్‌అప్‌తో ఆరంభమైంది. చూస్తుండగానే 17,380 స్థాయి అందుకుంది. 17,264 వద్ద కనిష్ఠాన్ని తాకినప్పటికీ కొనుగోళ్లు పుంజుకోవడంతో 17,410 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకొంది. మొత్తంగా 237 పాయింట్ల లాభంతో 17,339 వద్ద ముగిసింది.


ఆర్థిక సర్వే విశేషాలు, సారాంశం



 


* 2022 ఆర్థిక ఏడాది జీడీపీ వృద్ధిరేటును 9.2 శాతంగా అంచనా వేసింది.
* 2023 ఆర్థిక ఏడాది జీడీపీ వృద్ధిరేటును 8 నుంచి 8.5 శాతం మధ్య అంచనా వేసింది.
* ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది.
* 2021-22కు వ్యవసాయ రంగం అభివృద్ధి 3.9 శాతం ఉండనుంది.
* 2021-22కు పారిశ్రామిక రంగం వృద్ధిరేటు 11.8 శాతంగా ఉంటుంది.
* 2021-22కు సేవల రంగం వృద్ధిరేటు 8.2 శాతంగా అంచనా.
* ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ (PM-GKRA) కింద 50.8 కోట్ల మానవ పనిదినాలను కల్పించింది. ఇందుకోసం రూ.39,293 కోట్లు ఖర్చు చేసింది.
* మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 2021, నవంబర్‌ నాటికి 8.85 కోట్ల ఉపాధి కల్పించింది. ఇందుకు రూ.68,233 కోట్ల నిధులు విడుదల చేసింది.
* 2022-23 ఏడాదిలో సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని స్థూల ఆర్థిక సంకేతాలు తెలియజేస్తున్నాయి.
* డిమాండ్‌ మేనేజ్‌మెంట్‌తో పోలిస్తే సరఫరా వైపు సంస్కరణలను భారత్‌ సమర్థంగా చేపట్టింది.
* ఎగుమతుల్లో వేగంగా వృద్ధి చెందుతున్నాం. ఆర్థిక రంగంలో పెట్టుబడులకు స్కోప్‌ ఉంది.
* విస్తృతంగా టీకాలు వేయడం 2023 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధికి మద్దతుగా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.