Union Budget 2024-25 Expectations: ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం కేంద్ర బడ్జెట్‌ ప్రకటనకు సమయం దగ్గర పడుతోంది. మరో 10 రోజుల తర్వాత, ఈ నెల 23న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) కొత్త బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పిస్తారు. మోదీ 3.0 ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ ఇదే. 2024-25 బడ్జెట్‌ మీద ఆరోగ్య సంరక్షణ రంగానికి (Healthcare Sector) చాలా అంచనాలు ఉన్నాయి. 


కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఇదీ
బడ్జెట్‌కు సంబంధించి, ఔషధాల ధరల గురించి భారీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హెల్త్‌కేర్ సెక్టార్‌తో పాటు సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపే విషయం ఇది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర మందుల ధరలను పెంచబోమని ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గత ఏప్రిల్‌లో హామీ ఇచ్చారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి అప్పట్లో చెప్పారు.


ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మార్పులు
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని ఔషధాల ధరలు పెరిగాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA), తన నియంత్రణలో ఉన్న కొన్ని మందుల ధరల్లో మార్పులు ప్రకటించింది, అవి ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. NPPA చేసిన సరవణ తర్వాత... డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెటమాల్, మార్ఫిన్ వంటి నొప్పి నివారణ మందులు, అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ వంటి TB మందులు, క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్ వంటి యాంటీ కన్వల్సెంట్ ఔషధాలు మరింత ఖరీదయ్యాయి. మరోవైపు... మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, అలర్జీలకు సంబంధించిన మందుల ధరలు తగ్గాయి.


మందుల రేట్లను పెంచబోమని కేంద్ర మంత్రి గతంలో హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే కొన్ని నిత్యావసర ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతి చేసుకున్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ (API) ఆధారంగా మందుల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇటీవల అభివృద్ధి చేసిన & పేటెంట్ పొందిన మందుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. 


వివిధ వ్యాధుల చికిత్సలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి మందుల ధరలను నియంత్రించడంపై భారత ప్రభుత్వం దృష్టి పెడుతుందని కూడా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆరోగ్య సంరక్షణ రంగం కీలకమైనది. కాబట్టి, ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధులు సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి ఉండాలి. దీనివల్ల, దేశంలోని ప్రజలందరికీ సమానంగా, అధిక నాణ్యత గల ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దీనిని వదిలేసి ప్రజాకర్షక చర్యల కోసం పాకులాడకూడదు. ఆ చర్యలు స్వల్పకాలంలో ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఈ బడ్జెట్‌లో ప్రజల తక్షణ అవసరాలపైనే కాదు, భవిష్యత్ తరాల అవసరాల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి