Janasena: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే వాళ్లెవరూ పూల బొకేలు, విగ్రహాలు, శాలువలు తీసుకురావద్దని సూచించారు. వాటికి బదులు ప్రజలకు పనికి వచ్చే వస్తువులు తీసుకురావాలని అభ్యర్థించారు. 


డిప్యూటీ సీఎం అయిన తర్వాత వరస సమీక్షలతో పవన్ కల్యామ్ చాలా బిజీ అయిపోయారు. తన శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడటం లేదు. అదే టైంలో తనను కలిసేందుకు వచ్చిన  ముఖ్యులతో కూడా కాసేపు ముచ్చటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు. 


డిప్యూటీసీఎంను కలవడానికి వెళ్తున్నామని అతిథులంతా పూల బొకేలు, శాలువలు, ఇతర వస్తువులు తీసుకెళ్తున్నారు. నెల రోజుల్లోనే ఇవి భారీగా పేరుకుపోయాయి. తన వద్దకు వచ్చే సమయంలో ఏమీ తీసుకురావద్దని గతంలోనే పవన్ చెప్పారు కానీ... ఎవరూ వినిపించుకోవడం లేదు. ఖాళీ చేతులతో ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నారు. 


దీనికి పరిష్కారంగా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు పవన్ కల్యాణ్. తన వద్దకు వచ్చే వాళ్లు ఇకపై పూలబొకేలు, శాలువాలు ఇలాంటివి తీసుకురావద్దని... కూరగాయలు తీసుకురావలని సూచించారు. ఇప్పుడు తీసుకొచ్చేవి కళ్లకు ఇంపుగా కనిపిస్తాయేమో కానీ... ప్రజల కడుపు నింపవని అన్నారు. అందుకే ప్రజల ఆకలి తీర్చే కూరగాయలు తీసుకురావాలని హితవు పలికారు. 


దీనికి జనసేన ఎంపీలే స్ఫూర్తిగా నిలిచారు. పవన్‌ను కలసేందుకు వెళ్లిన ఎంపీలు బాలశౌరి, ఉదయ్‌ బొకేలకు బదులు కూరగాయల బుట్టను తీసుకెళ్లారు. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన పవన్ ఇలాంటివి తీసుకొస్తే అనాథ శరణాలయాలకు ఇవ్వొచ్చని అన్నారు. ఇకపై అందరూ ఇలాంటి ప్రయత్నం చేయాలన్నారు. వస్తే ఖాళీ చేతులతో రావాలని... తీసుకురాగలిగితే కూరగాయలు మాత్రమే తీసుకురావలన్నారు. అంతకు మించి ఏమీ తీసుకురాకపోయినా ఫర్వాలేదని అన్నారు.