SEBI Decision on NCDs: ఈక్విటీ మార్కెట్‌ను నదితో పోలిస్తే, బాండ్‌ మార్కెట్‌ మహా సముద్రం లాంటిది. అక్కడ తిమింగలాలు, సొర చేపలు (FIIs, DIIs) తప్ప చిన్న చేపలు (రిటైల్‌ ఇన్వెస్టర్లు) మనుగడ సాగించలేవు. ఈ పరిస్థితి మార్చడానికి సెబీ (SEBI) చర్యలు తీసుకుంది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ పెట్టుబడుల విషయంలో భారీ మార్పు తీసుకురాబోతోంది. ఇది అమల్లోకి వస్తే NCD లేదా ఇతర మార్కెట్లలో సంస్థాగతేతర పెట్టుబడిదార్ల భాగస్వామ్యం పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఎన్‌సీడీ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల ఉనికి సాధ్యమవుతుంది.


సెబీ కన్సల్టేషన్ పేపర్ 
ప్రస్తుత విధానం ప్రకారం, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDs), నాన్-కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను (NCRPSs) కనీసం లక్ష రూపాయల ముఖ విలువతో వివిధ కంపెనీలు జారీ చేస్తున్నాయి. దీనిని రూ.10,000 తగ్గించి జారీ చేయడానికి కంపెనీలను అనుమతించాలని సెబీ ప్రతిపాదించింది. తన ప్రతిపాదనను తెలియజేస్తూ ఒక కన్సల్టేషన్ పేపర్ జారీ చేసింది. ఈ కన్సల్టేషన్‌ పేపర్‌లో ప్రస్తావించిన అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సెబీకి పంపుతారు. సలహాలు, సూచనలు కూడా ఇస్తారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ ఇబ్బంది/నష్టం లేని విధానాన్ని సెబీ అమల్లోకి తెస్తుంది. 


ఈ స్టెప్‌ వల్ల కార్పొరేట్ బాండ్ మార్కెట్‌లో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మెరుగుపడుతుంది, పెట్టుబడులు పెరుగుతాయి. ఏడాది క్రితం, 2022 అక్టోబర్‌లో, NCD లేదా కార్పొరేట్ బాండ్ల ముఖ విలువను రూ.10 లక్షల నుంచి రూ.1 లక్షకు సెబీ తగ్గించింది.


NCD అంటే ఏంటి?
కంపెనీలకు వివిధ రకాల అవసరాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి డబ్బు కావాలి. IPO, FPO ద్వారా నిధుల సమీకరణతో పాటు, కంపెనీలు NCDల జారీ ద్వారా కూడా డబ్బులు సేకరించవచ్చు. ఎన్‌సీడీలను షేర్లుగా మార్చడం కుదరదు. అందుకే వాటిని నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ అంటారు. కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ కూడా ఉంటాయి, నిర్ణీత కాలం తర్వాత వీటిని షేర్లుగా మార్చుకోవచ్చు. NCD అంటే ఒక విధమైన అప్పు. ఎన్‌సీడీ ద్వారా సేకరించిన రుణంపై ఆ కంపెనీ వడ్డీ చెల్లిస్తుంది. 


NCDలపై 8-10% వడ్డీ ఎలా వస్తుంది?
NCDలకు ఒక మెచ్యూరిటీ తేదీ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఎంత వడ్డీ చెల్లిస్తుందో ‍‌(Interest Rate on NCDs) ఆ కంపెనీ ముందుగానే నిర్ణయిస్తుంది. కాబట్టి, NCDలను సబ్‌స్క్రైబ్‌ చేసుకునే పెట్టుబడిదార్లు స్థిర వడ్డీ రేటుతో రాబడి పొందుతారు. కంపెనీకి డబ్బు అవసరం కాబట్టే ఎన్‌సీడీలు జారీ చేస్తుంది. అందువల్ల వడ్డీ రేటు కొంత ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడిదార్లకు ఎన్‌సీడీలపై సాధారణంగా 8 శాతం నుంచి 10 శాతం రాబడి ఉంటుంది. NCDల్లో వివిధ మెచ్యూరిటీ పిరియడ్స్‌కు వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి. నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏడాది ప్రాతిపదికన కూడా వడ్డీ ఆదాయాన్ని అందుకోవచ్చు. 


రెండు రకాల NCDలు  
1. సెక్యూర్డ్ ఎన్‌సీడీలు, 2. నాన్‌-సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలు. 
సెక్యూర్డ్ ఎన్‌సీడీలు కొంటే: ఒకవేళ, మెచ్యూరిటీ సమయానికి ఆ కంపెనీ డబ్బు చెల్లించలేకపోతే, పెట్టుబడిదార్లు ఆ కంపెనీ ఆస్తులను అమ్మి తమ డబ్బును తిరిగి పొందవచ్చు.
నాన్‌-సెక్యూర్డ్‌ ఎన్‌సీడీలు కొంటే: కంపెనీ చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో ఉంటే, ఇన్వెస్టర్లు తమ డబ్బును తిరిగి పొందడం కష్టం.


సెకండరీ మార్కెట్‌ నుంచి కూడా పెట్టుబడి
అన్ని NCDలు ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ అవుతాయి. పెట్టుబడిదార్లు నేరుగా కంపెనీ నుంచి లేదా సెకండరీ మార్కెట్ నుంచి వీటిలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇటీవలి కాలంలో జారీ అయిన NCD స్కీమ్స్‌లో, పెట్టుబడిదార్లు 8.5-9.5 శాతం నుంచి 10 శాతం వరకు వార్షిక రాబడి పొందారు.


ప్రతి ఎన్‌సీడీకి రేటింగ్‌ ఏజెన్సీలు రేటింగ్‌ ఇస్తాయి. సాధారణంగా... బెటర్‌ రేటింగ్‌ ఉన్న ఎన్‌సీడీల్లో వడ్డీ రేటు, రిస్క్‌ తక్కువగా ఉంటుంది. తక్కువ రేటింగ్‌ ఉన్న ఎన్‌సీడీల్లో వడ్డీ రేటు, రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.


ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తరహాలోనే NCDలో పొందే వడ్డీపై ఆదాయ పన్ను చెల్లించాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: హెల్త్‌ పాలసీ క్లెయిమ్స్‌లో కామన్‌గా కనిపిస్తున్న తప్పులివి, మీరూ ఇలాగే చేస్తే క్లెయిమ్‌ రిజెక్ట్‌ అవుతుంది!