Blinkit Sangam Jal: కుంభమేళాకు వెళ్లలేదని బాధపడొద్దు, 'సంగమ జలం' 10 నిమిషాల్లో మీ ఇంటికొస్తుంది!
Maha Kumbhamela News: బ్లింకిట్ తన ప్లాట్‌ఫామ్‌లో విక్రయిస్తున్న 'సంగమ్ జల్' 100ML బాటిల్ ధర 69 రూపాయలు. ఆ నీళ్లను త్రివేణి సంగమం నుంచి తీసుకొచ్చినట్లు ఆ ఉత్పత్తి వివరాల్లో రాసి ఉంది.

Blinkit Sells Sangam Jal In 100 ml Bottles: 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు వచ్చిపోయే వాళ్లతో బస్సులు, రైళ్లు, విమానాలు, ఆటోలు.. ఇలా అన్ని ప్రయాణ సాధనాలు కిక్కిరిసిపోతున్నాయి. వారాంతాలు & ముఖ్యమైన రోజుల్లో రైల్వే స్టేషన్లలో నేల ఈనినట్లు జనం కనిపిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 62 కోట్ల మంది పాల్గొన్నారని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రకటించారు.
మహా కుంభమేళా సమయంలో త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాలన్న కోరిక కోట్ల మందికి ఉంటుంది. రద్దీ లేదా ఆర్థిక స్థితి కారణంగా అందరూ ప్రయాగ్‌రాజ్ వెళ్లలేకపోవచ్చు. అలాంటి వారి కోరిక తీర్చేందుకు, ఆన్‌లైన్ కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ 'బ్లింకిట్' త్రివేణీ సంగమ జలాన్ని తీసుకువచ్చింది. 'సంగమ్ జల్' పేరుతో ఆ నీటిని అమ్ముతోంది. కొంత డబ్బు ఇస్తే, త్రివేణీ సంగమంలోని గంగాజలం 10 నిమిషాల్లో మీ ఇంటికి చేరుతుంది.
'సంగమ్ జల్' ధర ఎంత?
బ్లింకిట్, తన ప్లాట్‌ఫామ్‌లో 100 మి.లీ. బాటిళ్లలో 'సంగమ్ జల్' విక్రయిస్తోంది. ఈ 100 ml బాటిల్ రేటు 69 రూపాయలు. ఉత్పత్తి వివరాల ప్రకారం, ఈ నీరు గంగ-యమున సంగమం నుంచి వచ్చింది. ఈ ప్రదేశంలో అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుందని చెబుతారు. అందుకే ఆ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు.
మతపరమైన ఉత్పత్తుల వ్యాపారం కొత్తమే కాదు
భారతదేశంలో మతపరమైన ఉత్పత్తులతో వ్యాపారం చేయడం కొత్త విషయం కాదు, ఇప్పటికే వందలాది ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు, కొత్తగా వచ్చిన 'సంగమ్ జల్'పై ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు దీనిని కొనడానికి ఆసక్తి చూపుతుండగా, మరికొందరు అనుమానంగా చూస్తున్నారు. అది నిజంగా త్రివేణీ సంగమం నుంచి తీసుకొచ్చిన జలమా లేక జనం నమ్మకంతో ఆడుకుంటున్నారా అనే ప్రశ్నలు వేస్తున్నారు. 'సంగమ్ జల్'కు ముందు నుంచే, చాలా కంపెనీలు గంగాజలాన్ని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: అసోం కోసం ట్రెజరీ ఓపెన్ చేసిన అదానీ - ఒకేసారి రూ.50,000 కోట్ల పంపింగ్ ప్లాన్
'సంగమ్ జల్' ఖరీదు ఎక్కువంటూ విమర్శలు
మార్కెట్‌లో, ఒక లీటరు మినరల్ వాటర్ బాటిల్‌ను దాదాపు రూ.20కు అమ్ముతున్నారు. బ్లింకిట్ 100 మి.లీ. 'సంగమ్ జల్'ను రూ.69కి అమ్ముతోంది. అంటే ఒక లీటరు 'సంగమ్ జల్' ధర రూ.690 అవుతుంది, మినరల్ వాటర్ కంటే చాలా రెట్లు ఖరీదైనది. ఈ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో బ్లింకిట్‌పై ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: EPFO మెంబర్లకు భారీ శుభవార్త - ఉద్యోగులకు మరో నెల టైమ్ ఇచ్చిన సర్కారు