Telangana Ration Card Latest News:తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Telangana Ration Card Latest News: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి టైం ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Telangana Ration Card Status Latest News: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఆశావాహులు భారీ సంఖ్యలో ఉన్నారు. వివిధ మార్గాల్లో వారి నుంచి ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంది. వారికి ఇప్పుడు కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి నుంచి కొత్తకార్డులు ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచిస్తోంది. కొత్త సంవత్సరానికి లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలని చూస్తున్న ప్రభుత్వం అంతకంటే ముందుగానే ఓ వేడుకలా ఈ పంపిణీ చేయాలని చూస్తోంది. దీనికి తగ్గ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో మాత్రమే కార్డులు ఇవ్వబోతున్న తెలంగాణ ప్రభుత్వం మార్చి 1 నుంచి పంపిణీ ప్రక్రియ చేపట్టబోతోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున వాటిని మినహాయిస్తారు. మిగిలిన జిల్లాల్లో కార్డులను పంపిణీ చేస్తారు. ఈ లెక్కన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కార్డులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటి విడతలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజుల లక్ష కార్డులు ఇస్తారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్- 285, వికారాబాద్- 22 వేలు, నాగర్‌కర్నూల్ - 15 వేలు, నారాయణపేట- 12 వేలు, వనపర్తి - 6 వేలు, మహబూబ్‌నగర్- 13 వేలు, గద్వాల్ - 13 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి- 6 వేలు, రంగారెడ్డి - 24 వేలు కార్డులు ప్రజలకు అందజేయనున్నారు.
Also Read: 'మోడల్ స్కూల్స్' ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అంటే మార్చి 8 నుంచి మిగతా జిల్లాల్లో పంపిణీ చేస్తారు. పదేళ్లుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు అందుకే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ప్రజాపాలన పేరుతో కొన్ని రోజులు దరఖాస్తులు తీసుకున్నారు. తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేసి కూడా దరఖాస్తులు తీసుకున్నారు. మొన్నీ మధ్య నిర్వహించిన కులగణన ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఇన్నిసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా మిగిలిన పోయిన వారికి మరో ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. మీసేవ కేంద్రాల ద్వారా కొత్త కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పింది.
చాలా సార్లు దరఖాస్తులు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఇంత వరకు కార్డులు మాత్రం మంజూరు చేయడం లేదు. అందుకే ఏ అవకాశాన్ని ప్రజలు వదులుకోవడం లేదు. చేసిన వాళ్లే మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేస్తున్నారు. అందుకే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పంపిణీ చేసిన తర్వాత ఇంకా అర్హులు ఉన్నట్టు అనిపిస్తే మరోసారి దరఖాస్తులు తీసుకోనుంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసి వారిలో అర్హులకు కార్డులు ఇవ్వనుంది. ఇలా దీన్ని ఓ నిరంతర ప్రక్రియలా చేపడతామని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది.
కీలకమైన ఆధార్ కార్డు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు, ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు రేషన్ కార్డే ఆధారం. అందుకే ప్రజలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు ఇస్తుందా అని పోటీ పడీ మరీ అప్లై చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.