Golnaka Amberpet flyover to open from Maha Shivaratri | హైదరాబాద్: నగర వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ  శివరాత్రి నుంచి అంబర్​పేట ఫ్లైఓవర్​ నగర వాసులకు అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి జి. కిషన్​రెడ్డి (Kishan Reddy) తెలిపారు. గోల్నాక చర్చ్ నుంచి అంబర్​పేట్ వాణి ఫోటో స్టూడియో వరకు ఫ్లైఓవర్ పరిశీలించారు కిషన్​ రెడ్డి. అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రితో పాటు రోడ్లు భవనాల శాఖ, నేషనల్ హైవే అధికారులు (RO) జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, రెవిన్యూ అధికారులు ఉన్నారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘చాదర్ ఘట్​నుంచి వరంగల్​ కు వెళ్లే జాతీయ రహదారికి గతంలో ఎన్టీఆర్​సీఎంగా ఉన్న సమయంలో రోడ్డు వైండింగ్​ చేశారు. అంబర్​ పేట చే నెంబర్​ వద్ద శ్మశాన వాటిక ఉండటంతో రెండు వైపులా రోడ్డు వైండింగ్​ కుదరలేదు. నేను అంబర్​ పేట ఎమ్మెల్యేగా, ఎంపీగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. ఫ్లైఓవర్​ నిర్మాణం చేయాలని కోరాను.  ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. స్థానికులు సైతం నిత్యం ట్రాఫిక్​ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ జాతీయ రహదారి నుంచి వెళ్లే వరంగల్​, ఖమ్మం జిల్లాల ప్రజలు కూడా ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో అంబర్ పేట్ ఫ్లైఓవర్​ మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగినప్పుడు ఆయన వెంటనే అంగీకరించి మంజూరు చేశారు.






గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కానీ, నేటి కాంగ్రెస్ (Congress)​ ప్రభుత్వం కానీ అంబర్ పేట్ ఫ్లైఓవర్​ నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. భూసేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కనుక తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి మిగతా ఐదు చోట్ల భూసేకరణ చేసి కేంద్రానికి సహకరించాలి. ఒకచోట భూసేకరణకు సంబంధించి రూ.2 కోట్ల 51 లక్షలు చెక్కు తీసుకున్న తర్వాత కూడా భూసేకరణకు స్థలం నేషనల్​ హైవే అథారిటి (NHAI)కి అప్పగించలేదు. దాన్ని త్వరగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి.


రోడ్డు, బ్యూటిఫికేషన్​ పనులు చేయాలి


జీహెచ్​ఎంసీ (GHMC), నేషనల్​ హైవే అధికారులతో ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాను. అంబర్ పేట్ ఫ్లైఓవర్​ కింద రోడ్డు వేయడంతోపాటు, గ్రీనరీ, బ్యూటిఫికేషన్​ చేయాలని అధికారులను నేను సూచించాను.ట్రాఫిక్​ రద్దీ దృష్ట్యా సాధ్యం కాదని అధికారులు చెప్పారు. ఫ్లైఓవర్​ పనులు పూర్తి చేసి ట్రాఫిక్​ ను పైనుంచి పంపి.. కింద రోడ్డు, బ్యూటిఫికేషన్​ పనులు చేయాలని వారికి సూచించాను. కనుక మిగిలిన 6 చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చేసి నేషనల్​ హైవే అథారిటి (NHAI)కి అప్పగిస్తే ఫ్లైఓవర్​ పనులు త్వరగా పూర్తి చేస్తామని’ కిషన్ రెడ్డి వెల్లడించారు.



శివరాత్రికి ఫ్లైఓవర్ ఓపెన్


ఈ శివరాత్రి నుంచి ఫ్లైఓవర్​ మీనుంచి వాహనాలను అనుమతించి.. కింద రోడ్డు నిర్మాణం, బ్యూటిఫికేషన్​ పనులు చేపట్టాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఈ అంబర్ పేట్ ఫ్లైఓవర్​కు సంబంధించి గతంలో అప్పటి సీఎం కేసీఆర్​ కు,  ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డికి పలు లేఖలు ఆయన రాశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. మిగిలిన 6 చోట్ల భూసేకరణను చేపట్టాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ ఫ్లైఓవర్​ కోసం ఇప్పటి వరకు రూ.338 కోట్లు ఖర్చు చేయగా, ఏండ్ల తరబడి నెలకొన్న ట్రాఫిక్​ కష్టాలకు ఈ శివరాత్రితో కొంత ఉపశమనం లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు.


Also Read: CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకీ ఓటేస్తారు ? సీఎం రేవంత్ సూటిప్రశ్న