స్టాక్‌ మార్కెట్లపై భల్లూకం గట్టిగా పట్టు బిగించింది. ప్రతి రోజూ సూచీలు పతనం అవుతుండటంతో ఇన్వెస్టర్లు 'బేర్‌ బేర్‌'మంటున్నారు. తమ పోర్టుపోలియోల విలువ 10-50 శాతం వరకు తగ్గిపోవడంతో బాధతో విలపిస్తున్నారు. 2022లో ఇప్పటి వరకు నిఫ్టీ 500 స్టాక్స్‌లో 83 శాతం కంపెనీలు ప్రతికూల రాబడినే అందివ్వడం ఇందుకు ఉదాహరణ. దేశంలోని అతిపెద్ద కంపెనీల సమూహం ఇదే కావడం గమనార్హం.


నిఫ్టీ 500లో చాలా షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని దాటి కిందకు వచ్చేశాయి. మరికొన్ని అందులో 200 రోజుల మూవింగ్‌ యావరేజెస్‌ (200 DMA) దిగువనే చలిస్తున్నట్టు మనీకంట్రోల్‌ డేటా ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు నిఫ్టీ 500 సూచీ 12 శాతం పతనమవ్వగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌, నిఫ్టీ 50 సూచీలు పది శాతానికి పైగానే నష్టపోయాయి.


ఈ ఏడాది ఆరంభం నుంచి చూసుకుంటే ధనీ సర్వీసెస్‌, సొలారా యాక్టివ్‌ ఫార్మా, బ్రైట్‌కామ్‌ గ్రూప్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, మెట్రొపొలిస్‌ హెల్త్‌కేర్‌, హైకల్‌, ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, వెల్‌స్పన్‌ ఇండియా, నజారా టెక్నాలజీస్‌, పేటీఎం, జొమాటో, స్టెర్‌లైట్‌ టెక్నాలజీ కంపెనీల షేర్లు 40-80 శాతం పతనమయ్యాయి. ఇక హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, శ్రీ సెమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ వంటి నిఫ్టీ 50 కంపెనీలు ఈ మధ్యే ఏడాది కనిష్ఠాన్ని అందుకున్నాయి. ఇప్పటి వరకు 8-40 శాతం వరకు నష్టపోయాయి.


'ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (FII) ఎక్కువగా అమ్మకాలు చేపట్టడంతో ఈక్విటీ మార్కెట్లపై ఎక్కువగా సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉంది. ప్రీమియం విలువ అధికంగా ఉండటం, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కంపెనీల లాభాలు తగ్గిపోతున్నాయి. అదే మార్కెట్లలో సెల్లింగ్‌కు కారణం అవుతోంది' అని బ్రోకింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ స్నేహ పొదార్‌ అంటున్నారు. దిద్దుబాటు ఎక్కువగా ఉండటంతో సుదీర్ఘ కాలం పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి అవకాశమని ఆనంద్‌ రాఠి ఈక్విటీ రీసెర్చ్‌ అధినేత నరేంద్ర సోలంకి చెబుతున్నారు. చాలా వరకు గ్రోత్‌ స్టాక్స్‌ మంచి విలువతో లభిస్తున్నాయని వెల్లడించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.