Bank of Baroda FD Rates Hike: భారతదేశ కేంద్ర బ్యాంక్‌ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపో రేటును పెంచడంతో, ఇప్పటికే దాదాపు చాలా బ్యాంకులు తాము ఇచ్చే రుణాల మీద, స్వీకరించే డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచాయి. ఈ లిస్ట్‌లోకి తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda) చేరింది. 


రిటైల్ టర్మ్ డిపాజిట్ల మీద (Fixed Deposits) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. రూ. 2 కోట్ల లోపు దేశీయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద అధిక రేట్లను ఈ బ్యాంక్‌ ఇప్పుడు ఆఫర్‌ చేస్తోంది. కొత్త వడ్డీ రేట్లు సోమవారం ‍(డిసెంబర్ 26, 2022) నుంచి చెల్లుబాటు అవుతున్నాయి.


తాజా పెంపు తర్వాత.. సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాల వ్యవధి డిపాజిట్ల మీద 3 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది.


బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన పత్రిక ప్రకటన ప్రకారం.... "ప్రత్యేక పథకమైన బరోడా తిరంగ ప్లస్ డిపాజిట్ పథకం ‍‌(Baroda Tiranga Plus Deposit Scheme) మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. 399 రోజుల కాల పరిమితితో డిపాజిట్‌ చేసే బరోడా తిరంగ ప్లస్ డిపాజిట్ పథకం ఇప్పుడు ఏడాదికి 7.80 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం, నాన్‌-కాలబుల్‌ (మెచ్యూరిటీ తేదీ వరకు వెనక్కు తీసుకోని) డిపాజిట్లకు 0.25 శాతం కలిపి 7.80 శాతం వరకు వడ్డీని ఆఫర్‌ చేస్తోంది".


1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కాల పరిమితి ఉండే డిపాజిట్లకు 7.50 శాతం (సీనియర్ సిటిజన్‌లకు 0.50 శాతం, నాన్‌ కాలబుల్‌ డిపాజిట్‌లకు 0.25 శాతం కలిపి) వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.


ఈ త్రైమాసికంలో ‍‌(అక్టోబర్‌-డిసెంబర్‌ 2022) బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైల్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి. నవంబర్‌ నెలలో 100 bps వరకు వడ్డీ రేటును పెంచింది.


సాధారణ ప్రజలకు బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న FD రేట్లు:
7- 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.00 శాతం వడ్డీ రేటు
46- 180 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద 4.00 శాతం వడ్డీ రేటు
181 -270 రోజుల డిపాజిట్ల మీద 5.25 శాతం వడ్డీ రేటు
271 రోజులు - 1 సంవత్సరం డిపాజిట్ల మీద 5.75 శాతం వడ్డీ రేటు
1 సంవత్సరం డిపాజిట్ల మీద 6.75 శాతం వడ్డీ రేటు
1 సంవత్సరం - 3 సంవత్సరాల డిపాజిట్ల మీద 6.75 శాతం వడ్డీ రేటు
2 సంవత్సరాలు - 3 సంవత్సరాల డిపాజిట్ల మీద 6.75 శాతం వడ్డీ రేటు
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 6.25 శాతం వడ్డీ రేటు 
10 సంవత్సరాలు దాటిన డిపాజిట్ల మీద 6.25 శాతం వడ్డీ రేటు 


ఈ డిపాజిట్ల మీద, కాల వ్యవధిని బట్టి, సీనియర్‌ సిటిజన్లకు మరికొంత అదనపు వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అందిస్తోంది.


బరోడా తిరంగ డిపాజిట్ పథకం కింద, 444 రోజులు & 555 రోజుల డిపాజిట్ల మీద సాధారణ పౌరులకు 6.75 శాతం p.a. వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 399 రోజుల కాల పరిమితి డిపాజిట్ల మీద 7.05 శాతం అందిస్తోంది.