ఏపీ సీఎం జగన్  ఈ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పయమం అవుతున్నారు. ఏపీకి రావాల్సిన ఆర్ధిక సహాయం, నిధులు, పోలవరం ప్రాజెక్ట్ ఇతర అంశాల ప్రధాని మోడీతో చర్చించే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో రేపు సమావేశం కానున్నారు సీఎం  జగన్. ఏపీకి రావాల్సిన ఆర్థిక సహకారంతోపాటు రాష్ట్ర విభజన సమస్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మూడు రాజధానులు అంశంపై  కేంద్ర సహకారానికి సంబంధించి కూడా చర్చ అభ్యర్థించనున్నారు. గతంలో ప్రధానితో సమావేశం అయినప్పుడు పోలవరం నిధులు, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశాలపై చర్చించారు. దీంతో పాటు ఏపికి రావాల్సిన ఆర్థిక సహాయం, ప్రస్తుతం ఉన్న ఆర్థిక  పరిస్థితి  ప్రధానికి  వివరించే  అవకాశం  ఉందన్న ప్రచారం జరుగుతుంది. 


తెలుగు రాష్ట్రాల మధ్య... 


ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అంశాలపై అధికారులు చర్చలు జరిపారు. అయితే అవి ముందుకు సాగటం లేదు. తెలంగాణా సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై కూడా మోడీకి జగన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఆస్తులకు సంబంధించి పిటిషన్ వేయడంతో ఈ అంశం కూడా ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకు వెళ్లే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నిధులు అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది బడ్జెట్ కూడా ఉండడంతో ఏపీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరే అవకాశం ఉంది.


రైల్వే జోన్ పై .....
 
రైల్వే ప్రాజెక్టుల వ్యవహరంపై కూడ ఈసారి ప్రధానికి సీఎం వివరిస్తారని అంటున్నారు. విభజన తరువాత రైల్వేపరంగా అందాల్సిన ప్రయోజనాలు కూడా ఏపీకి ఇప్పటికి దక్కలేదు. దీంతో ప్రాజెక్టుల విషయంలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే, వెనుకబడి ఉంది. రైల్వే జోన్ పై కూడా క్లారిటి రావాల్సి ఉంది. ఈ విషయంపై వీలయితే జగన్ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, మంత్రిని కూడా కలసి రైల్వే జోన్‌పై తేల్చాలని కోరతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.


ఈ రాత్రికే ఢిల్లీకి...


సీఎం జగన్ తన షెడ్యూలో పలు మార్పులు చేసుకున్నారు. వాస్తవానికి 28వ తేదీన ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి అదే రోజు ప్రధానితో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసుకొని ఈ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, గన్నవరం వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీకి వెళతారు. అక్కడ రాత్రికి బస చేసి 28వ తేదీన ప్రధానితో సమావేశం  అవుతారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలసే అవకాశం ఉంది.


ముందు నిధుల విడుదల అనంతరం ఢిల్లీకి పయనం


రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 79 వేల 65 మంది కొత్త పెన్షనర్ల ఖాతాల్లో రూ.590 కోట్లు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలనే సంకల్పంతో మరో అవకాశం ఇస్తూ లబ్ధిదారుల అకౌంట్లకు నగదు ట్రాన్స్ ఫర్ చేస్తారు.