Bajaj Auto Production Cut:
బజాజ్ ఆటో మార్చి నెలలో వాహనాల ఉత్పత్తి తగ్గించనుంది. ఎగుమతి ఆధారిత ప్లాంట్లలో 25 శాతం వరకు కోత పెట్టనుందని తెలిసింది. కంపెనీ అతిపెద్ద విదేశీ మార్కెట్ నైజీరియాలో అనిశ్చిత నెలకొనడమే ఇందుకు కారణం.
ద్విచక్ర, త్రిచక్ర వాహనాల ఉత్పత్తిలో బజాజ్ ఆటో అప్రమత్తంగా వ్యవహరిస్తోందని కొన్ని వర్గాలు మీడియాకు వివరించాయి. పల్సార్, కేటీఎం మోటార్స్ సైకిళ్ల ఉత్పత్తిలో బజాజ్‌కు తిరుగులేదు. మార్చి నెలలో కంపెనీ 250,000- 2,70,000 యూనిట్లు ఉత్పత్తి చేయనుందని తెలిసింది. 2023 ఆర్థిక ఏడాది తొలి 9 నెలల్లో సగటు సంఖ్య 338,000తో పోలిస్తే ఇదెంతో తక్కువ.
సాధారణంగా బజాజ్ ఆటో మొత్తం ప్లాంట్లలో నెలకు 550,000 యూనిట్లు ఉత్పత్తి చేయగలదు. ఈ లెక్కన మార్చి నెలలో 50 శాతానికి పైగా కోత పడుతోంది. ఒకవేళ కంపెనీ ద్విచక్ర వాహనాల వాల్యూమ్ లక్ష యూనిట్లకు తగ్గితే 2020, జులై నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్న తక్కువ వాల్యూమ్ అవుతుంది.
లాక్‌డౌన్ సమయంలో కంపెనీ తొలిసారి ఉత్పత్తిని తగ్గించిన సంగతి తెలిసిందే. 2023, జనవరిలో బజాజ్ 100,679 యూనిట్లను ఎగుమతి చేసింది. 30 నెలల్లో ఇదే అత్యంత కనిష్ఠం కావడం గమనార్హం. వరుసగా ఆరో నెల, ఏడాది ప్రాతిపదికన 34.4 శాతం తగ్గినట్టు అవుతుంది.
వలూజ్ ప్లాంట్‌లో బాక్సర్, సీటీ, ప్లాటిన మోడళ్లను ఉత్పత్తి చేస్తారు. మార్చిలో ఇక్కడ ఉత్పత్తి 90,000 యూనిట్లకు తగ్గనుంది. సాధారణంగా ఇక్కడ నెలకు 2,25,000 యూనిట్లను ఉత్పత్తి చేయొచ్చు. కాగా 2023 ఆర్థిక ఏడాదిలో విదేశీ ఆధారిత ఉత్పత్తి 20 - 25 శాతం మేర తగ్గుతుందని కంపెనీ అంచనా వేసింది.
ఉత్పత్తి తగ్గిస్తోందని వార్తలు రావడంతో బజాజ్ ఆటో షేరు రెండు రోజులుగా నష్టాల్లో ట్రేడవుతోంది. మంగళవారం ఉదయం రూ.3647 వద్ద మొదలైంది. రూ.3630 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. రూ.3743 వద్ద రోజువారీ గరిష్ఠాన్ని అందుకుంది. ఈ వార్త రాసే సమయానికి రూ.10 నష్టంతో రూ.3627 వద్ద కొనసాగుతోంది. ఆరు నెలలుగా బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఏకంగా 11 శాతం పతనమైంది.
Also Read: నెగెటివ్ నోట్‌లో క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్ రూ.10వేలు పతనం
Also Read: 3 నుంచి 38కి అదానీ - మళ్లీ నం.1 పొజిషన్‌లో మస్క్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.