Gautam Adani: బాంబ్‌ లాంటి రిపోర్ట్‌ను హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ బ్లాస్ట్‌ చేసిన తర్వాత, గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ పతనం ప్రారంభమైంది. అదానీ గ్రూప్‌ కంపెనీల విలువతో పాటు, గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద విలువ (Gautam Adani Net worth) ‍‌ కూడా హరించుకుపోయింది. 


3 నుంచి 38కి..
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో (Forbes rich list), గౌతమ్ అదానీ ఇప్పుడు 38వ స్థానంలో ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక రాక ముందున్న మూడో స్థానం నుంచి, ఇప్పుడున్న 38వ స్థానానికి, చాలా కిందకు పడిపోయారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ ట్రాకర్ ప్రకారం, ప్రస్తుతం అదానీ నికర విలువ 33.4 బిలియన్ డాలర్లు. 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక రాక ముందు ఈ విలువ 119 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నెల రోజుల్లోనే దాదాపు మూడొంతుల సంపద లేదా 85 బిలియన్ డాలర్లకు పైగా కోత పడింది. 


అయితే, ప్రపంచ ధనవంతులను ఫాలో అయ్యే బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index) ప్రకారం, ప్రపంచ కుబేరుల్లో అదానీ 30వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 40 బిలియన్ డాలర్లు. అదానీ నికర విలువలో ఎక్కువ భాగం అదానీ గ్రూప్‌ కంపెనీల్లోని హోల్డింగ్ నుంచి వస్తుంది. ఈ గ్రూప్‌నకు అదానీ బాస్‌. 


అదానీ గ్రూప్‌ సంపదలో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాల వ్యాపారాల నుంచి వస్తుంది. ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే, పవర్‌ సెక్టార్‌లలో ఈ గ్రూప్‌ ముఖ్యమైన వ్యాపారాలు ఉన్నాయి. ఈ నెల రోజుల్లో, అదానీ గ్రూప్‌ మొత్తం నికర విలువ దాదాపు 150 బిలియన్ డాలర్లు క్షీణించినట్లు BSE డేటాను బట్టి అర్ధం అవుతోంది.


ముకేష్‌ అంబానీకి 8వ ర్యాంక్‌
84.3 బిలియన్ డాలర్ల నికర విలువతో, ముఖేష్ అంబానీ (Mukesh Ambani Net worth) ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో 8వ స్థానంలో ఉన్నారు. పెట్రో కెమికల్స్, ఆయిల్ & గ్యాస్, టెలికాం, రిటైల్ సెక్టార్‌లలో వ్యాపారం చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ముకేష్‌ అంబానీ బాస్‌.


ఎలాన్‌ మస్క్‌ నంబర్‌.1
2022లో విపరీతమైన నష్టాల కారణంగా ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన టెస్లా CEO ఎలాన్ మస్క్ మళ్లీ పుంజుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నంబర్‌.1 పొజిషన్‌లో నిలబడ్డారు. ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను ఓడించి, తన పూర్వ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు.


గత ఏడాది డిసెంబర్‌లో, ఎలాన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. అదే సమయంలో ఆర్నాల్డ్ సంపద పెరగడంతో, ఎలాన్ మస్క్‌ను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించారు. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం, ఎలాన్ మస్క్ కేవలం 2 నెలల్లోనే నంబర్ వన్ కిరీటాన్ని తిరిగి పొందారు. అయితే, ఫోర్బ్స్ బిలియనీర్‌ లిస్ట్‌ ప్రకారం మస్క్‌ ఇప్పటికీ రెండో స్థానంలో ఉన్నారు.


ఎలాన్ మస్క్ ఆస్తి ఎంత?
బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ సంపద విలువ 187 బిలియన్ డాలర్లకు చేరుకుంది, రెండో స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 185 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద రికార్డు స్థాయిలో పెరిగింది. జనవరి నుంచి, మస్క్ తన ఆస్తులకు మరో $50.1 బిలియన్లు జోడించారు.