Atul Auto Shares: ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా (Vijay Kishanlal Kedia) పేరు వినగానే అతుల్ ఆటో షేర్లు పూకనం వచ్చినట్లు చిందులేశాయి. ఇవాళ (సోమవారం) బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ఓపెనైనా, అతుల్ ఆటో ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు. ప్రి మార్కెట్‌లోనే భారీగా ఆర్డర్లు పెట్టేశారు.
మూలధనాన్ని పెంచుకోవడానికి... విజయ్ కిషన్‌లాల్ కెడియా సహా ప్రమోటర్లకు, నాన్ ప్రమోటర్లతోపాటు రూ.115 కోట్ల విలువైన వారెంట్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదించడంతో ఇంట్రా డే ట్రేడ్‌లో అతుల్ ఆటో షేర్లు 14 శాతం పెరిగి రూ.244.85కి చేరాయి.
ఒక్కోటి 198 రూపాయల చొప్పున 5.81 మిలియన్ వారెంట్లను జారీ చేయడానికి బోర్డు ఆమోదించింది. జారీ తేదీ నుంచి గరిష్టంగా 18 నెలల వ్యవధిలో వీటిని ఈక్విటీ షేర్లుగా మార్చుకోవచ్చు. విజయ్ కిషన్‌లాల్ కెడియాకు 5.05 మిలియన్ వారెంట్లు, ప్రమోటర్లకు 7,57,575 వారంట్లు, ఖుష్బు ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌కు 6,56,565 వారెంట్లు, జయంతిభాయ్ జగ్జీవన్‌భాయ్ చంద్రకు 1,01,010 వారెంట్లను అతి త్వరలో కేటాయించనున్నారు.
పెరగనున్న విజయ్ కెడియా వాటా
ఈ ఏడాది జూన్ 30 నాటికి, అతుల్ ఆటోలో కెడియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 1.47 శాతం వాటా ఉంది. ఇప్పుడు జారీ చేస్తున్న వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చుకున్న తర్వాత ఈ స్టేక్ మరింత పెరుగుతుంది.
విజయ్ కెడియా, తన వాటాను పెంచుకుంటున్నారంటే ఈ కంపెనీకి బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయన్న అంచనాతో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ షేర్ల కోసం ఎగబడ్డారు. విపరీతమైన రష్ సృష్టించారు.
అతుల్ ఆటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.470 కోట్లు. 22 మిలియన్ షేర్లు మార్కెట్‌లో ఉన్నాయి. మూలధనాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం చేపట్టిన వారెంట్ల జారీ వల్ల 25 శాతం పైగా షేర్లు డైల్యూట్ అవుతాయి.
అతుల్ బిజినెస్
అతుల్ ఆటో, గుజరాత్‌కు చెందిన త్రీ వీలర్ వాహనాల తయారీ కంపెనీ. అన్ని వేరియంట్లు, ఇంధనాల్లో ఆటోలను తయారు చేస్తోంది. సంవత్సరానికి 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. అయితే, FY22లో కేవలం 16,000 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది.
ఈ కంపెనీ వృద్ధి పథం అంచనాల కంటే తక్కువగా ఉందని బ్రోకరేజ్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లాంచ్‌ను ఈ కంపెనీ విషయంలో కీలక అంశంగా చూడాలని చెబుతోంది.
బ్రోకరేజ్ ఆనంద్ రాఠీ ఈ కంపెనీ మీద బుల్లిష్‌గా ఉంది. కరోనా కాలం ముగిసిన తర్వాత పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తున్నాయి కాబట్టి త్రీ వీలర్ల డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. ఈ సెగ్మెంట్‌లో, FY23లో 73 శాతం, FY24లో 35 శాతం వృద్ధిని అంచనా వేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.