Apple Jobs in India: అమెరికన్‌ కంపెనీ, ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ (Apple iPhone), మన దేశంలో గత రెండు సంవత్సరాల్లోనే లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ఆ ఉద్యోగాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇచ్చింది, ఉద్యోగుల్లో 72 శాతం మందిని మహిళలనే తీసుకుంది. అంటే.. గత రెండు సంవత్సరాల్లో, ఇండియాలో ఆపిల్‌ ఉద్యోగాల్లోకి తీసుకున్నవాళ్లలో, ప్రతి 100 మందిలో 72 మంది మహిళలే. ఈ ఉద్యోగాలన్నీ తయారీ విభాగంలో (manufacturing) సృష్టించింది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PLI పథకం స్ఫూర్తితో, తయారీ రంగంలో, యాపిల్‌ గత 24 నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్వీట్‌ చేశారు.


ఆపిల్ ఇండియన్‌ ఫ్యాక్టరీల్లో 70 నుంచి 72 శాతం మంది మహిళలు ఉన్నారని చెప్పుకున్నాం కదా. వీరిలోనూ యువతులకే ఆపిల్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఆపిల్‌ ఇండియన్‌ ఫ్లాంట్లలో పని చేస్తున్న మహిళల్లో 19 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు 70 శాతం మంది. ఈ సంఖ్యతో, భారతదేశంలోని మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో అతి పెద్ద సింగిల్ బ్రాండ్‌గా ఆపిల్‌ అవతరించింది. ఇందులోనూ, అత్యధికంగా గత 20 నెలల్లోనే ఉద్యోగాలు ఇచ్చింది. అదే సమయంలో, ఉద్యోగాలు వెతుక్కుంటూ తొలిసారి ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతుల సంఖ్య వీరిలో ఎక్కువగా ఉంది. అంటే, ఎలాంటి పని అనుభవం లేని వాళ్లనే (ఫ్రెషర్లు) ఎక్కువ సంఖ్యలో తీసుకుంది.


చాలామంది అర్హత ఇంటర్మీడియట్          
ఆపిల్‌లో జాబ్‌‌ సంపాందించిన 1 లక్షకు పైగా ఉద్యోగుల్లో చాలా మంది విద్యార్హత ఇంటర్మీడియట్ మాత్రమే. డిప్లొమా డిగ్రీ తీసుకున్నవాళ్లు మరికొందరు ఉన్నారు. ఐఫోన్‌ అసెంబ్లింగ్ చేయడానికే ఎక్కువ మందిని ఈ ఉద్యోగంలోకి ఆ కంపెనీ తీసుకుంది. మన దేశంలో కొంతకాలం ఆపిల్‌ ఐఫోన్‌ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి, రికార్డ్‌ స్థాయికి చేరాయి. మన దేశంలో తయారై విదేశాలకు ఎగుమతయ్యే ఐఫోన్ల ఉత్పత్తి కూడా పెరిగింది. వ్యాపార వృద్ధి వేగంగా పెరగడంతో, ఆ డిమాండ్‌కు తగ్గట్లుగా కొత్త ఉపాధి అవకాశాలను ఆపిల్‌ సృష్టించింది.


భారతదేశం నుంచి $5 బిలియన్ల ఐఫోన్ ఎగుమతులు        
FY2023లో ఐఫోన్ల తయారీని ఆపిల్‌ వేగవంతం చేసింది. భారతదేశం నుంచి ఐఫోన్ ఎగుమతులు $5 బిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో, భారతదేశం మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు $10 బిలియన్లకు చేరుకున్నాయి. ఆపిల్, 2017లో భారతదేశంలో ఐఫోన్ తయారీని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కంపెనీ అనేక కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. భారతదేశంలో విక్రయించడంతో పాటు విదేశాలకూ ఎగుమతి చేసింది.


ముంబైలో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభం    
భారతదేశంలో ఆపిల్ మొట్టమొదటి రిటైల్‌ స్టోర్‌ను, ఆపిల్‌ సీఈవో టిమ్ కుక్ ముంబైలో ప్రారంభించారు. మంగళవారం (18 ఏప్రిల్‌ 2023) నాడు ఆ స్టోర్‌ ప్రారంభమైంది. ఆ దుకాణంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 100. ఆ స్టోర్‌ 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నెలవారీ అద్దె 42 లక్షల రూపాయలు.