మన్ కీబాత్ వందో ఎపిసోడ్‌కు భారీగా ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ప్రజలంతా ఆ కార్యక్రమం వినేలా చూడాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసులొమాట కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీబాత్ పేరుతో ప్రసారం అవుతోంది. ఈ ఆదివారం జరిగే కార్యక్రమం వందో ఎపిసోడ్ కావటంతో బీజేపి నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
పల్లె పల్లెలో మోదీ నినాదం మారుమోగిలా మన్‌కీబాత్‌పై చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది ఏపీ బీజేపీ. దీని కోసం ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయిందా నాయకత్వం. ఇప్పటికే గ్రామ స్థాయిలో అందరూ ఈ కార్యక్రమాన్ని వినేలా చూసేలా చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ స్ధాయిలో మన్ కీబాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులకు సూచించారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాల ఇంచార్జిలతో వర్క్ షాప్ నిర్వహించింది పార్టీ. ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్న నేతలు జిల్లాల వారీగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించింది. మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు యువజనులను, రైతుల సంఘాలను కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించాలన్నారు.
ప్రధానమంత్రి మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మమేకమయ్యే అధ్భుత కార్యక్రమం అని బీజేపీ నేతలు వివరించారు. మన్ కీ బాత్‌లో అనేక సందర్భాల్లో మన రాష్ట్రం గురించి, వ్యక్తుల గురించి, ఇతర అంశాలపై కూడా ప్రస్తావించిన విషయాలను స్థానికులకు వివరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి మన్ కీ బాత్ వందో ఎపి సోడ్‌లో అందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు.
ఒంగోలులో బీజేపి ర్యాలీ....
ఒంగోలు భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర ఎస్సీ మోర్చా జోనల్ ఇన్చార్జి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్సీ మోర్చా నాయకులతో ఒంగోలు అసెంబ్లీ పరిధిలో భారీగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహా ఇన్చార్జ్ సునీల్ దేవధర్ మాట్లాడుతూ మోదీ భారతీయ వారసత్వాన్ని గౌరవించడం పరిరక్షించటంలో భాగంగా అంబేద్కర్ స్మారకార్థం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు. అంబేద్కర్ వారసత్వాన్ని పురస్కరించుకొని 5 ప్రదేశాలను పంచ తీర్థాలుగా తీర్చిదిద్ది జాతికి అంకితం చేసి ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి మోదీ అని కొనియాడారు. వైఎస్ఆర్ సీపీ దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చాలని అనుకోవటం నిజమైన దళితులకు అన్యాయం చేయటమేనన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించిన జగన్ ప్రభుత్వం, ప్రజలను దోచుకోవటమే టార్గెట్‌గా పెట్టుకుందని ఆరోపించారు. ఓబీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పది శాతానికి కుదించి బీసీలను అవమానపరిచిందని అన్నారు. ఎస్సీ ,ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాల కింద రావలసిన 60శాతం సబ్సిడీని రానివ్వకుండా వారిని ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం దళితులకు సంబంధించిన 23 పథకాలను నిర్వీర్యం చేసిందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పేరు మార్చడం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిందని అన్నారు.