ఎకో ఇండియా సంస్థతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందని.. ఎకో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, సిబ్బంది సామర్థ్యం పెంచేలా ఎకో ఇండియా ఆధ్వర్యంలో ఎకో ప్రాజెక్టు పై నిర్వహించే రెండు రోజుల సదస్సును ఆయన విజయవాడలో  ప్రారంభించారు. 
ఎకో ఇండియాతో మెరుగైన వైద్య సేవలు...
ఎకో ఇండియాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు వైద్య కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా శిక్షణ ఉంటుందన్నారు. వార్డు బాయ్ నుంచి అత్యున్నత స్థాయి వైద్యాధికారి వరకు ఎకో ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని.. హెల్త్ కేర్ రంగంలో ఇలాంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తామని, ప్రతీ ఆరు నెలలకి ఒకసారి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య డేటా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. రోగులతో వైద్య సిబ్బంది మసులుకునే విధానం వల్ల కూడా వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో చాలామంది స్థానిక ఆస్పత్రులపైనే ఆధారపడతారని..అందుకే గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేలా వైద్య సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. 
ఓప్పందంలో అంశాలు ఇవే...
రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందని, కృష్ణబాబు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ఎచ్‌పీ తదితర సిబ్బందికి వివిధ విధానాల్లో శిక్షణ ఉంటుందని, ఏపీలో మెరుగైన వైద్య సదుపాయాల ద్వారా ముందస్తు రోగ నివారణ జరుగుతోందని.. గ్రామస్థాయిలోనే దాదాపు 80 శాతం రోగాలకి చికిత్స అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. 
తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫిలియా వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 48వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని.. వారందరికీ ఎకో ప్రాజెక్టు ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరింత పెంచామన్నారు. పలుచోట్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని గుర్తించాలన్నారు. వైద్య రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని.. కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో మార్పు రావాలన్నారు. టెలీ మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్, టెలీ లెర్నింగ్ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. 
మెడికల్ కళాశాలలు ప్రారంభం
ఈ ఏడాది అయిదు మెడికల్ కళాశాలలు ప్రారంభించబోతున్నామని.. ఇప్పటికే విజయనగరం మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయన్నారు. ఎకో ఇండియా సంస్ధతో ఎంవోయూ ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థికభారం పడలేదని..వారే ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితులు తగ్గించాలనేది ప్రభుత్వ భావనన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదన్నారు. రాష్ట్రానికి 20 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కావాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని.. జాతీయ రహదారుల పక్కనే 13 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.