ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ వారసుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్. పొంగులేటికి సుఖేష్ చంద్రశేఖర్‌కు పెద్దగా తేడా లేదన్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఆయన చేసిన ఆర్థిక నేరాలు, భూదందాలను బయట పెడతామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వను అంటూ పొంగులేటి మాట్లాడిన మాటలు అహంకారపూరితమని తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆయన్ని పార్టీలోకి చేరమని పిలుస్తున్న ఆ రెండు పార్టీలు ఒకసారి ఆలోచించుకోవాలని సండ్ర సూచించారు.
కేసీఆర్‌ని కొనాలని చాలామంది చూశారు! కానీ జరగలేదు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ నాయకత్వం పట్ల ఢిల్లీ నుండి కుట్రలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. వారికి సహకరించేందుకు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన పొంగులేటి ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఛానళ్లలో స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని.. ప్రజలను గందరగోళం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ వారసుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇద్దరికీ పెద్దగా తేడా లేదన్నారు. కేసీఆర్‌కు వేలకోట్లు కప్పం కట్టానని సిగ్గుమాలిన మాటలు చెబుతున్నాడని.. కేసీఆర్‌ని కొనాలని చాలా మంది చూశారు కానీ, అది జరగలేదని అన్నారు. నీ గురువు రాజశేఖర్ రెడ్డి వల్లనే కాలేదు.. నువ్వెంత, నీ స్థాయిఎంత? పొంగులేటి మోసకారి. పొంగులేటి ఒక అబద్ధాల కోరు. పెళ్లికి కాదు నీ కూతురు ఎంగేజ్మెంట్ కూడా సీఎం కేసీఆర్ వచ్చారు. రాజకీయంగా విమర్శించు.. కానీ కూతురు పెళ్లిని, కొడుకు పెళ్లిని అడ్డుపెట్టుకుని విమర్శించి దిగజారకు అని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు.
రాజకీయ లబ్ధి కోసం కుటుంబాన్ని వాడుకునే వాడుకునే మొదటి రాజకీయనాయకుడు నువ్వే. జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంటే జిల్లా ప్రజలు దీవిస్తారు, లేదా నిన్ను దీవిస్తారు. ప్రజలే ఇక్కడ న్యాయనిర్ణేతలు. కమ్యూనిస్టుల పుణ్యాన నువ్వు గెలిచావు. కమ్యూనిస్టుల గురించి మాట్లాడే హక్కు, నైతిక అర్హత నీకు లేదు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు నువ్వు చేసిన ఆర్థిక నేరాలు, భూదందాలను బయట పెడతాం. డీసీసీబీ బ్యాంకులో ఆర్థికనేరం చేసిన వారిని నీ పక్కన పెట్టుకున్నావు. నారాయణపురం కాంట్రాక్టరుగా అవతారం ఎత్తిన నాటినుంచి నేటివరకు నువ్వు చేసిన ఆర్థికదందాలపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేస్తాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది, పొంగులేటికి ఇంఛార్జి ఇచ్చిన మధిర ఎలా ఓటమి పాలైంది నీకు దమ్ము లేదా? మదన్ లాల్‌ను ఓడించి రాములు నాయక్‌ను పార్టీలోకి ఎందుకు తీసుకువచ్చావ్? నిధులు లేని, పూర్తికాని సీతారామ ప్రాజెక్టుకు పొంగులేటి టెండర్ ఎందుకు వేశారని ఎమ్మెల్సీ తాతామధు ప్రశ్నించారు
పొంగులేటి వ్యక్తిత్వాన్ని ఆ పార్టీలు గమనించాలి
ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వను అంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడిన మాటలు అహంకారపూరితమని తల్లాడలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఏం తప్పు చేశామని అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వబోమని చెబుతున్నాడని ప్రశ్నించారు. ఇదంతా ప్రజల గమనిస్తున్నారని అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని పొంగులేటి పదేపదే చెప్పుకుంటున్నారు. ఆహ్వానిస్తున్న పార్టీలు ఆయన వ్యక్తిత్వాన్ని గమనించాలని సూచించారు. నీవేంటో ఈ జిల్లా ప్రజలకు తెలుసు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి, ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? చోట మోటా నాయకులు మాటలను ప్రజలు కనిపెడుతున్నారని పొంగులేటిని ఉద్దేశించి సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు.