Dhavaleshwaram News: జీవనది అడుగంటింది. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన చుక్కనీరు లేక ఎడారిని తలపిస్తోంది. ధవళేశ్వరం దిగువన ఉన్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయల్లో ఎన్నడూ లేని విధంగా నీరు లేక గోదారమ్మ వెలవెలబోతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయ రంగానికి ధవళేశ్వరం ద్వారానే సాగు నీరు అందుతుండగా ముఖ్యంగా గోదావరిలో నీటి నిల్వల స్థాయి పడిపోవడంతో నీటిఎద్దడి పరిస్థితి తలెత్తుతోంది. తూర్పు, పశ్చిమ మద్య డెల్టా పరిధిలో రబీ కాలానికి ప్రతీ ఏటా 10.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు 94 టీఎంసీల సాగు, తాగు నీరు అందిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఏప్రిల్ 15 వరకు కాలువలు కట్టే వరకు ఈనీరు అందిస్తుండగా చాలా ప్రాంతాల్లో రబీ పంట చేతికందిన పరిస్థితి లేదు. ఆలస్యంగా నాట్లు వేయడం, ఇతరత్రా కారణాలతో శివారు ప్రాంత రైతులు అవస్థలు పడుతున్నారు.
సహజ జలాలు ఆశించినంత లేకనే..
ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర స్టోర్ చేసేది 3 టీఎంసీలు మాత్రమే కాగా ప్రస్తుతం 1.91 టీఎంసీ నిల్వ ఉంది. ఇక్కడి అసవరాల కోసం సీలేరు నుంచి 3000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. లోగడతో పోల్చుకుంటే సగం పడిపోయింది. సీలేరు జలాలు, సహజ ప్రవాహాలు తగ్గితే తూర్పు, పశ్చిమ, మద్య డెల్టాకు ఇంకా ఇవ్వాల్సిన జలాలు ప్రశ్నార్ధకమే కాగా రబీ కాల వ్యవధి ఏప్రిల్ 15తో ముగిసిందని, ఇంకా సాగు, తాగునీటి అవసరాల కోసం పొడిగించడం జరిగిందని, మరో వారం రోజుల్లో కాలువలు కట్టే ప్రకటన కూడా వెలువడవచ్చని అధికారులు చెబుతున్నారు.
సరిపడా నీరు విడుదల చేస్తున్నాం..
ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన కెనాల్స్ నుంచి సాగు, తాగు నీటి అవసరాలకు సరిపడా నీటిని విడుదల చేస్తున్నామని ధవళేశ్వరం జల వనరుల శాఖ ఈఈ కాశీ విశ్వేశ్వర రావు తెలిపారు. ఈస్ట్ డెల్టాకు 1400 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 450, వెస్ట్ డెల్టాకు 3000 క్యూసెక్కులు మొత్తం కలిపి 4850 క్యూసెక్కులు నీటిని రోజూ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతులు..
తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలో శివారు ప్రాంతాల్లో సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఎదుర్కొంటున్నారు అన్నదాతలు. రబీ పంట కోతలు ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. ఆలస్యంగా నాట్లు వేసిన చాలా ప్రాంతాల్లో ఈనిక దశ నుంచి కోత దశకు చేరుకున్నాయి. అయితే ఈ సమయంలోనే సాగునీరు అత్యంత అవసరం కాగా చాలా కొన్ని ప్రాంతాల్లో సాగునీరు లేక పంటలు నాశనం అవుతున్నాయని రైతులు గొగ్గోలు పెడుతున్నారు. సాగునీరు వృథా పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ శివారు ప్రాంతాల్లోని కాలువల్లో అసలు ప్రవాహమే లేకపోతే ఇంకేం చేసేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ఇటీవలే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అధికారుల తీరుకు నిరసనగా బీడువారిన చేలల్లో బైక్‌లు నడిపి తమ నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే తాళ్లరేవు ప్రాంతాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రంగా కనిపిస్తోంది. అటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు చాలా ప్రాంతాల్లో అడుగంటి బోరు నీటిని ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.