Nanny Job in America: సాధారణంగా, ఉద్యోగాల్లో చాలా పని ఒత్తిడి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే జాబ్స్‌ కొన్నయితే, 24/7 నడిచే జాబ్స్‌ మరికొన్ని. ఓ సర్వే ప్రకారం, నూటికి 95% మంది తాము చేస్తున్న ఉద్యోగాలతో సంతృప్తిగా/ఇష్టంగా లేరు. అయితే, ఒత్తిడి లేని, ఆడుతూపాడుతూ పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీలో తయారీ సమయంలో కాఫీ/చాక్‌లెట్‌/వైన్‌ వంటి వాటిని రుచి చూసి సర్టిఫై చేయడం; కొత్తగా తయారు చేసిన పరుపులపై నిద్ర పోయి, అవి ఎంత కంఫర్ట్‌గా ఉన్నాయో రిపోర్ట్‌ చేయడం; దేశదేశాలు తిరుగుతూ, అక్కడి టూరిస్ట్‌ డెస్టినేషన్స్‌, బస, తిండి, రవాణా సౌకర్యాల వాటి గురించి రాయడం, కొత్తగా రూపొందించిన వీడియో గేమ్స్‌ ఆడుతూ, వాటిలో లోపాలు కనిపెట్టడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఈ తరహా ఉద్యోగాల్లో డబ్బుకు డబ్బు, ఎంజాయ్‌మెంట్‌కు ఎంజాయ్‌మెంట్‌ ఉంటుంది.


అమెరికాలోనూ  ఈ విధమైన ఉద్యోగ ప్రకటన ఒకటి వచ్చింది. ఆ జాబ్‌ కోసం సెలెక్ట్‌ అయితే జీతం 1 లక్ష అమెరికన్‌ డాలర్లు, అంటే దాదాపు 83 లక్షల రూపాయలు ఇస్తారు.


అమెరికాకు చెందిన వ్యాపారవేత్త ఒకరు, నానీ (Nanny) ఉద్యోగానికి సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఒక రకంగా 'ఆయా' ఉద్యోగం ఇది. పిల్లల బాగోగులు చూసుకోవడం, వారిని ఆడించడం నానీ పని. అమెరికాలో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకోవడానికి నానీలను నియమించుకోవడం సాధారణమే. అయితే, నానీ ఉద్యోగానికి ఇంత ఎక్కువ జీతం ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి.


మరో ఆసక్తికర కథనం: భాగ్యనగరంలో భారీగా పెరిగిన ఇళ్ల రేట్లు, ముంబైలో కూడా ఈ జోరు లేదు


ఇంత జీతం ఎవరు చెల్లిస్తున్నారు?
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి ఇంత పెద్ద జీతం ఆఫర్‌ చేశారు. తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకునే సమర్థవంతమైన నానీ ఆయనకు కావాలట. ఆయన, భారతీయ సంతతికి చెందిన బిలియనీర్. నానీ కోసం  రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో యాడ్‌ ఇచ్చారు. అమెరికన్ మీడియా 'బిజినెస్ ఇన్‌సైడర్' ప్రకారం, ఎంపికైన అభ్యర్థికి 1 లక్ష డాలర్లు జీతం ఇవ్వనున్నట్లు ఆ యాడ్‌లో ఉంది. ఈ ఉద్యోగం కోసం EstateJobs.comలో ప్రకటన ఇచ్చారు.


నానీ చేయాల్సిన పనులు ఏంటి?
కుటుంబ సాహసాల్లో (ఫ్యామిలీ ఎడ్వంచర్స్‌) పాల్గొనడం ద్వారా పిల్లల ఎదుగుదలకు నాని తోడ్పడవలసి ఉంటుందని ఆ యాడ్‌లో వివరించారు. నానీ, వీక్లీ షెడ్యూల్‌ ప్రకారం పని చేయాలి. వారంలో ఒక రోజు సెలవు దొరుకుతుంది. కుటుంబంతో కలిసి తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో వారాంతంలో విహార యాత్రలు, కుటుంబ ప్రయాణాలు, ప్రైవేట్ విమాన ప్రయాణం వంటివి ఉంటాయి.
 
పిల్లల వస్తువులను ప్యాక్‌ చేయడం, అన్ ప్యాక్ చేసే బాధ్యత కూడా నానీదే. అభ్యర్థి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. సంబంధిత ఉద్యోగంలో అనుభవం కూడా ఉండాలి. దీంతోపాటు.. నానీ ఉద్యోగంలో చేరే వ్యక్తి ఒక ఒప్పందంపై కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. నానీ పని, జీతం మీకు నచ్చితే మీరు కూడా అప్లై చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: నిలదొక్కుకుంటున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial