Residential Property Prices: సొంతింటి కల రోజురోజుకు ఖరీదుగా మారుతోంది. సామాన్యుడు తనకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే రేట్లు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మ్యాజిక్‌బ్రిక్ ప్రాప్‌ఇండెక్స్ రిపోర్ట్ (Magicbricks PropIndex Report) ప్రకారం, దేశంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు జూన్ క్వార్టర్‌తో (ఏప్రిల్-జూన్ కాలం) పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో (జులై-సెప్టెంబర్ కాలం) 5.4% పెరిగాయి. అదే సమయంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ డిమాండ్ కూడా 8.4 శాతం పెరిగింది.
మ్యాజిక్‌బ్రిక్ ప్రాప్‌ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం.. ఇళ్లు/ఫ్లాట్ల రేట్లు, డిమాండ్ పెరిగినా, జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో సరఫరా 7.2 శాతం తగ్గింది.
డిమాండ్ పెరిగిన నగరాలు
దేశంలోని 13 పెద్ద నగరాల్లో 2 కోట్ల మంది కస్టమర్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్‌ఇండెక్స్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. గ్రేటర్ నోయిడాలో నివాస ఆస్తుల అన్వేషణలో 38.9% పెరుగుదల కనిపించింది. నోయిడాలో ఈ సంఖ్య 20.4%, కోల్‌కతాలో 13.6%, బెంగళూరులో 13.5%గా ఉంది. ఈ నగరాలన్నింటిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీకి డిమాండ్ పెరుగుతోందని ఈ నివేదికను బట్టి స్పష్టమవుతోంది.
పెద్ద నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ డిమాండ్ - సరఫరాలో భారీ గ్యాప్ కనిపిస్తోంది. దేశంలో స్థిరాస్తి వైపు ప్రజలు నిరంతరంగా ఆసక్తి పెంచుకుంటూనే ఉన్నారు. దీంతో పాటు, దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి నమోదు కావచ్చు - మ్యాజిక్‌బ్రిక్స్ CEO సుధీర్ పాయ్
ప్రజలకు కావల్సిన ప్రాపర్టీస్ ఇవి
క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) ప్రాతిపదికన, రెడీ-టు-ఆక్యుపై ప్రాపర్టీ రేట్లు 44% పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్ ప్రాప్‌ఇండెక్స్ రిపోర్ట్ వెల్లడించింది. అదే సమయంలో, నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ ధరలు త్రైమాసిక ప్రాతిపదికన 8.2% పెరుగుదలను నమోదు చేశాయి. పెద్ద నగరాల్లో త్రిబుల్ బెడ్‌రూమ్ (3BHK) ఫ్లాట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రజలు పెద్ద ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 3BHK ఫ్లాట్ల డిమాండ్ 52% చేరుకుంది, త్రైమాసిక ప్రాతిపదికన ఇది 1% ఎక్కువ.
వార్షిక ప్రాతిపదినకన (YoY) ప్రాపర్టీ రేట్ల విషయానికి వస్తే... గ్రేటర్ నోయిడా, గురుగావ్‌లో నివాస ఆస్తుల ధరలు గత ఏడాది కంటే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వరుసగా 27.2% శాతం, 33.4% శాతం పెరిగాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్
రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank (India)) కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ సంస్థ సర్వే చేసి రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ కంపెనీ నివేదిక ప్రకారం దేశంలో ఇళ్ల అమ్మకాలు ఆరేళ్ల గరిష్ఠానికి చేరాయి. సెప్టెంబర్ క్వార్టర్‌లో 82,612 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో చేతులు మారిన 73,691 యూనిట్లతో పోలిస్తే, రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్‌లో ఈసారి 12% జంప్ ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22,308 యూనిట్లు, రాజకీయ రాజధాని దిల్లీలో 13,981 యూనిట్లు, బెంగళూరులో 13,169 యూనిట్లు, చెన్నైలో 3,870 యూనిట్లు, కోల్‌కతాలో 3,772 యూనిట్లు, పుణెలో 13,079 యూనిట్లు, అహ్మదాబాద్‌లో 4,108 యూనిట్లు చేతులు మారాయి.
హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్
ఇక్కడ, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 8,325 ఇళ్లు/ఫ్లాట్ల సేల్స్ జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 7,900 యూనిట్లు అమ్మారు. దీంతో పోలిస్తే ఈసారి సేల్స్ 5% శాతం పెరిగాయి. భాగ్యనగరంలో ఇళ్ల రేట్లు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 11% పెరిగాయి. కోల్‌కతాలో 7%, ముంబైలో 6%, బెంగళూరులోనూ 6%, పుణెలో 5%, అహ్మదాబాద్, దిల్లీలో తలో 4%, చెన్నైలో 3% వరకు ఇళ్ల ధరలు పెరిగాయి. అంటే, రేట్ల పెరుగుదలతో భాగ్యనగరమే టాప్ ప్లేస్‌లో ఉంది, దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ అయిన ముంబయిని కూడా బీట్ చేసింది. ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల రేట్లు దాదాపు రెట్టింపు పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial