భారతదేశంలో ఇప్పటివరకు తాము 11.6 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష రీతిలో ఉపాధి, ఉద్యోగాలను సృష్టించామని అమెజాన్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 2025 నాటికి 20 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవడానికి తాము సన్నాహాలు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఆదివారం ప్రకటించింది. అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ.. “11.6 లక్షలకు పైగా ఉద్యోగాలను మేం సృష్టించాం. సుమారు USD 5 బిలియన్ల ఎగుమతులు ప్రారంభించాం. భారతదేశంలో 40 లక్షల MSMEలు డిజిటలైజ్ చేశాము. వీటిలో ఐటీ, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, తయారీ, కంటెంట్ ఉత్పత్తి, ప్రతిభ అభివృద్ధి, ఇతర వ్యాపారాలు అన్నీ ప్రాతినిథ్యం వహిస్తాయి.’’ అని అన్నారు.
2025 నాటికి భారతదేశం నుండి మొత్తం ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు అమెజాన్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. 2025 నాటికి, భారతదేశం నుండి USD 10 బిలియన్ల సంచిత ఎగుమతులకు వీలు కల్పిస్తుందని 2020లో అమెజాన్ ప్రకటించింది. కోటి MSMEలను డిజిటలైజ్ చేస్తామని 2020 జనవరిలో ప్రకటించింది.
ఇది విక్రేతలు, చేతిపనులు, చేనేత కార్మికులతో పాటు పంపిణీ, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లతో సహా 40 లక్షల MSMEలకు ప్రయోజనం చేకూర్చింది. ‘‘భారతదేశంలో డిజిటల్ పరివర్తన, సమకాలీన, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అమెజాన్ పెద్ద పాత్ర పోషిస్తున్నట్లు మేం ఆశిస్తున్నాం’’ అని తివారీ చెప్పారు. గత సంవత్సరం, అమెజాన్ USD 250 మిలియన్ల Amazon Sbhav వెంచర్ ఫండాను ఆవిష్కరించింది, ఇది టెక్నాలజీ - కేంద్రీకృత సంస్థలు, వ్యవస్థాపకులలో పెట్టుబడి పెట్టనుంది. అమెజాన్ ఇప్పటికే ఫండ్‌లో భాగంగా MyGlamm, M1xchange మరియు Small Case వంటి సంస్థలలో పెట్టుబడి పెట్టింది.
అమెజాన్ పేర్కొంటున్న 11.6 లక్షల ఉద్యోగాల్లో కొన్ని నేరుగా సంస్థలో పనిచేసేవి కాగా మరికొన్ని దానికి అనుబంధంగా ఉండే రంగాలకు చెందినవి. డెలివరీ, లాజిస్టిక్స్, రవాణా, ప్యాకేజింగ్ మొదలైనవి ఈ దీనికి చెందినవే. గతేడాది జరిగిన వార్షికోత్సవంలో అమెజాన్ సంభవ్ వెంచర్ పేరుతో వెంచర్ క్యాపిటల్ ను కూడా ప్రారంభించింది. సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించే స్టార్టప్ లో పెట్టుబడులు పెడతామని పేర్కొంది. ఇప్పటికే మైగ్లామ్, ఎం1 ఎక్స్ఛేంజ్, స్మాల్ కేస్ మొదలైన సంస్థల్లో పెట్టుబడి పెట్టింది.
‘‘దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేస్తున్నాము. కాబట్టి భారత్లో వ్యాపార రంగం వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే టెక్నాలజీ, టూల్స్ వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. కేవలం గతేడాదిలో అమెజాన్.. ఐటీ, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, తయారీ, కంటెంట్ క్రియేషన్, స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో 1.35 లక్షల ఉద్యోగాలను సృష్టించింది.