భారత విమానయాన రంగంలో 'ఎయిర్ ఇండియా'ది ప్రత్యేక ప్రస్థానం. ఒకప్పుడు టాటాలే స్థాపించిన ఈ కంపెనీ ప్రభుత్వ పరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రైవేటీకరణ రూపంలో టాటాలకే సొంతమైంది. అసలు 'ఎయిర్ ఇండియా' అనే పేరెలా పెట్టారో చాలామందిలో ఆసక్తి నెలకొంది. 75 ఏళ్ల క్రితం ఒపీనియన్ పోల్ ద్వారా ఈ పేరు పెట్టామని టాటా గ్రూప్ వివరించింది.
పది రోజులు క్రితమే ఎయిర్ ఇండియా అధికారికంగా టాటాల సొంతమైంది. నియంత్రణాధికారం పూర్తిగా ఆ గ్రూపునకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 1946లో టాటా సన్స్ కంపెనీ నుంచి విస్తరిస్తున్నప్పుడు టాటా ఎయిర్ లైన్స్ పేరును ఎంపిక చేశారు. 'ఎయిర్ ఇండియా, ట్రాన్స్ ఇండియా ఎయిర్ లైన్స్, పాన్ ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ నుంచి భారత తొలి ఎయిర్‌లైన్ కంపెనీ పేరును ఎంపిక చేశాం' అని టాటా గ్రూప్ ఆదివారం వెల్లడించింది. 1946లోని- టాటా మంత్లీ బులెటిన్‌లోని వివరాలను వరుస ట్వీట్లు చేసింది.
టాటా ఎయిర్ లైన్స్‌కు ఒక మంచి పేరు పెట్టేందుకు ఇబ్బంది పడ్డారు. అలాంటప్పుడు ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, పాన్ ఇండియన్ ఎయిర్‌లైన్స్, ట్రాన్స్ ఇండియన్స్ ఎయిర్‌లైన్స్ మధ్య ఏదో పెట్టాలో తెలియక సతమతం అయ్యారు. దాంతో ప్రజాస్వామ్య పద్ధతిలో పేరు ఎంపిక చేయాలని టాటా సంస్థ పెద్దలు నిర్ణయించారు. శాంపిల్ ఒపీనియర్ సర్వే నిర్వహించాలని అనుకున్నారు. టాటా ఉద్యోగులకు ఓటింగ్ పేపర్లు పంచారు. తొలి, ద్వితీయ ప్రాధాన్య పేర్లు ఎంపిక చేయాలని సూచించారు.
'తొలి లెక్కింపులో ఎయిర్ ఇండియాకు 64 ఓట్లు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ 51, ట్రాన్స్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 28, పాన్ ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు 19 ఓట్లు వచ్చాయి. దాంతో ఆఖరి రెండు తొలగించాం. తుది లెక్కింపులో ఎయిర్ ఇండియాకు 72, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 58 ఓట్లు వచ్చాయి. దాంతో కంపెనీ పేరును ఎయిర్ ఇండియాగా పెట్టాం' అని ఆ బులెటిన్ పేర్కొంది.
Also Read: LIC offers: కస్టమర్లకు ఎల్‌ఐసీ ఆఫర్- ఆలస్య రుసుములో భారీ రాయితీ
Also Read: SBI Q3 Results: ఎస్‌బీఐ బంపర్ ప్రాఫిట్! మార్కెట్ అంచనాలు బీట్ చేసిన బ్యాంకు