భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (57: 71 బంతుల్లో, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 177 పరుగులు చేస్తే భారత్ ఈ మ్యాచ్ గెలిచినట్లే. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.


టాస్ గెలిచి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడంతో వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వెస్టిండీస్ ఓపెన్ షాయ్ హోప్‌ను (8: 10 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుట్ చేసి సిరాజ్ భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. భారత స్పిన్ ద్వయం యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో అస్సలు నిలదొక్కుకోనివ్వలేదు. వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను (0) కూడా చాహల్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.


దీంతో వెస్టిండీస్ 79 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ (57: 71 బంతుల్లో, నాలుగు సిక్సర్లు), ఫాబియన్ అలెన్ (29: 43 బంతుల్లో, రెండు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 78 పరుగులు జోడించి వెస్టిండీస్‌ను గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారు. అయితే కీలక సమయంలో ఫాబియన్ అలెన్ వాషింగ్టన్ సుందర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.


ఆ తర్వాత వెంటనే జేసన్ హోల్డర్‌ను ప్రసీద్ కృష్ణ అవుట్ చేయడంతో వెస్టిండీస్ తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. ఇక వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసిపోవడానికి ఎంతో సేపు పట్టలేదు. 43.5 ఓవర్లలో 176 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ అయింది. భారత్ 177 పరుగులు చేస్తే మొదటి వన్డే గెలుచుకుని సిరీస్‌లో ముందంజ వేస్తుంది. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్‌కు మూడు, ప్రసీద్ కృష్ణకు రెండు, మహ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కాయి.