పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని ముఖ్యమంత్ర జగన్మోహన్ రెడ్డి కోరారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని అన్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సీఎంతో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. వారితో సీఎం జగన్‌ మాట్లాడారు. తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని.. మీరు లేకపోతే తాను లేనని సీఎం వారితో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని జగన్‌ అన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు చేయగలిగినంత వరకూ సాయం చేశామని సీఎం చెప్పారు.


సీపీఎస్‌ విషయంలో కూడా ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ కీలక అంశంపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై నిపుణులతో అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఆ సమస్య పరిష్కారంలో ఉద్యోగ సంఘాలనూ భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని ఉద్యోగ నేతలతో చెప్పారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అంశంలో రోస్టర్‌ పద్ధతి ప్రకారం చర్యలు చేపడతామని.. దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వివరించారు. సుమారు 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని.. భవిష్యత్‌లో ఆ ఫలాలు వస్తాయని చెప్పారు. మంత్రుల కమిటీకి ఉద్యోగ సంఘాల నిర్ణయాలు సంతోషాన్ని ఇచ్చాయని భావిస్తున్నట్లు సీఎం అన్నారు.


దీంతో ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసిన ఉద్యోగ సంఘ నేతల్లో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగులు ఒక కుటుంబం అని సీఎం చెప్పారు. ఆర్థిక పరిస్థితి ఊహించిన పీఆర్సీ ఇవ్వలేకపోయామని సీఎం జగన్ చెప్పారు. హెచ్ఆర్ఏ స్లాబ్, ఆదనవు పెన్షన్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ అన్నిటిపై స్పష్టత ఇచ్చారు. ప్రతి నెలా స్టీరింగ్ కమిటీ సభ్యులతో మంత్రుల కమిటీ సమావేశం ఉంటుందని సీఎం చెప్పారు. మొత్తంగా రూ.11 వేల కోట్ల భారం ఉన్నా ఉద్యోగుల న్యాయమైన  డిమాండ్లను పరిష్కరించామన్నారు.’’ అని అన్నారు.


ఫిట్ మెంట్‌లో పెరుగుదల లేకపోయినా మిగిలిన అంశాల్లో సంతృప్తి ఉందని.. హెచ్ఆర్ఏ, అదనపు పెన్షన్ సీసీఏల వల్ల ప్రయోజనాలు ఉన్నాయని సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం  తమకు సానుకూలంగా ఉందని అన్నారు. ‘‘ఆర్థిక పరిస్థితి బావుంటే భవిష్యత్‌లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని సీఎం చెప్పారు. మేము సాధించిన ప్రయోజనాల భారం 1,300 కోట్లు. ఐఆర్ రికవరీ వల్ల మరో రూ.5 వేల కోట్లు భారం. ఉపాధ్యాయులు ఉద్యోగుల ఐక్యత వల్లే ఇది సాధ్యమైంది. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో ఇలాగే ఉద్యోగులు సహకారించాలి.’’ అని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.