గత నెలరోజులుగా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పీఆర్సీ ప్రతిష్టంభన ఓ కొలిక్కి వచ్చింది . ప్రభుత్వంతో సై అంటే సై అన్నట్టు వ్యవహరించిన ఉద్యోగులు శాంతించారు. అర్థరాత్రి నుంచి సమ్మెకు ఉద్యోగ సంఘాలు సిద్దమవుతున్న వేళ కీలకమైన HRA అంశంతోపాటు ఇతర డిమాండ్లపై  ఇరు వర్గాల మధ్యా అంగీకారం కుదిరింది. అర్ధరాత్రి నుంచి ప్రారంభంకావాల్సిన సమ్మె ఉపసంహరించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం కంటే ముందు మంత్రుల కమిటీతో చర్చలు ముగిసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో ఆన్లైన్ లో మాట్లాడారు . 


HRA స్లాబుల్లో మార్పులను ప్రతిపాదించిన మంత్రుల కమిటీ 


ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినట్టు ఇంటి అద్దె భత్యానికి (HRA ) సంబంధించిన స్లాబుల్లో మార్పులకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ముందుగా అందరికీ 12శాతం HRA ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. దీంతో 10,12,16 స్లాబుల విధానంలో HRA ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 11 వేల సీలింగ్‌తో 10 శాతం ఇంటి అద్దె భత్యం, 2 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతంతో 13 వేలు మించకుండా HRA, 2 నుంచి 50 లక్షల్లోపు జనాభా ఉండే ప్రాంతాల్లో 16 శాతం HRA తో 17000 రూపాయలు  దాటకుండా ఇంటి అద్దె భత్యం, 50 లక్షల కంటే ఎక్కువ  జనాభా ఉన్న ప్రాంతాల్లో 24 శాతంతో 25000 దాటకుండా HRA, ఇంటి అద్దె భత్యం ఇచ్చేలా మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగుల, HODల HRA 24 శాతం  ఇచ్చేందుకు కూడా మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది . 


పెన్షనర్ల అదనపు పెన్షన్ స్లాబుల్లోనూ మార్పులకు అంగీకరించిన ప్రభుత్వం 


70 ఏళ్ళు దాటిన పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చే అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ను జగన్ ప్రభుత్వం 80 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఇస్తామంటూ ప్రకటించిన  విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తునట్టు దృష్ట్యా ప్రభుత్వం వెనక్కు తగ్గింది . 70-74 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పెన్షనర్లకు 7 శాతం ,75-79 ఏళ్ల  మధ్య వయస్సు గల ఉద్యోగులకు 12 శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించింది . 


పీఆర్సీ 23 శాతమే 
 


ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ అయిన 23 శాతం పీఆర్సీ రద్దు మాత్రం నెరవేరలేదు. మొన్న తాము డిమాండ్ చేసినట్టు 30 శాతం కుదరకపోయినా కనీసం 25 శాతం అన్నా ఫిట్మెంట్ ఇవ్వాలని అడిగినా ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యం కాదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. దానితో పీఆర్సీ విషయంలో మాత్రం ఉద్యోగులకు నిరాశే ఎదురైంది .


 
చర్చలు సఫలం అవుతాయని మొదటి నుంచీ చెబుతున్నా కదా : మంత్రి బొత్సా సత్యనారాయణ
 


ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు సఫలం అవుతాయని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానన్నారు మంత్రి బొత్సా సత్యరాయణ . చర్చలు ముగిసిన వెంటనే విజయనగరం బయల‌్దేరిన బొత్సా ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగం అని తొలి నుంచీ తానూ చెబుతున్నట్టు తెలిపారు . 



 ఉద్యోగుల ఆవేదన ను ప్రభుత్వం గుర్తించింది :  సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు.
 


పీఆర్సీ ప్రకటన అనంతరం ఉద్యోగుల్లో కలిగిన ఆవేదన, ఆందోళన అర్ధం చేసుకున్న ప్రభుత్వం.. వాళ్లు వెళ్లబుచ్చిన ప్రతీ అంశంపైనా లోతుగా చర్చలు జరిపినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు వెలిబుచ్చిన కొన్ని డిమాండ్ల వల్ల  చర్చలు ఆలస్యమైనట్టు సజ్జల తెలిపారు. పాత పద్దతిలోనే ప్రతీ 5 ఏళ్లకు వేతన సవరణ చెయ్యాలని నిర్ణయించినట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే ముందుగా చెప్పినట్టు 27 శాతం IR బకాయిల రికవరీ అంశాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారు తెలిపారు. ఉద్యోగులు పట్టుబడుతున్న సీసీఏను కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించామన్నారు. ఇంతకు మించి సీఎం ఉద్యోగులకు లబ్ది చేకూరాలని చూసినా కోవిడ్ వల్ల ఎప్పుడు కోలుకుంటుందో తెలియని ఆర్ధిక పరిస్థితి సహకరించక పోవడం వల్ల అనుకున్నంత పీఆర్సీ ఇవ్వలేకపోయినట్టు రామకృష్ణ రెడ్డి చెప్పారు.  


మాకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గ్రహించింది :బండి శ్రీనివాస రావు , ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ 
 


గత నెల రోజులుగా తాము వ్యక్త పరిచిన ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకుందన్నారు ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస రావు. తాము అడగకుండానే 27 శాతం మధ్యంతర భృతి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం, గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల కల్పన వంటి ఎన్నో అమలు చేసిన సీఎం జగన్.. ఉద్యోగులకు అత్యంత ఉత్తమ పీఆర్సీ ఇస్తారని ఆశలు పెట్టుకున్నట్టు బండి శ్రీనివాస రావు తెలిపారు. 5 డీఏలు ఒకేసారి ఇవ్వడంతోపాటు తాము వెళ్లబుచ్చిన చాల డిమాండ్లకు అంగీకరించిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారాయన . అలాగే ఉద్యమ సమయంలో ఏవైనా సీఎంను బాధించేలా ఏవైనా మాట్లాడి ఉంటే దానికి చింతిస్తున్నట్టు బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగ నేతలు సీయంను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నట్టు ఆయన చెప్పారు.  



5 ఏళ్ల పీఆర్సీని కొనసాగిస్తామనడం సంతోషం : సూర్యనారాయణ ,ఉద్యోగ జేఏసీ నేత 


సీపీఎస్ రద్దుపై 31 మార్చిలోపు ఒక రూట్ మ్యాప్ ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారని అన్నారు ఉద్యోగ జేఏసీ నేత సూర్య నారాయణ. విలేజ్ -వార్డుసెక్రటేరియేట్లలో పనిచేసివారికి కూడా కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తామనడాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పిన ఆయన నాలుగు ప్రధాన జేఏసీల నాయకులు కలిసి మీడియా సమక్షంలో తమ నిరసనకు గుర్తుగా ధరించిన నల్ల బ్యాడ్జీలు తొలగిస్తున్నట్టు సూర్యనారాయణ తెలిపారు . 


మేము ఎక్కువ రాజీ పడకుండానే ప్రభుత్వం సహకరించింది :వెంకట్రామి రెడ్డి ,ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు


ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడిగా HOD కార్యాలయాల్లో, ఏపీ సచివాలయంలో పని చేసే ఉద్యోగులకు ఏకంగా 24 శాతం ఇంటి అద్దె భత్యం ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు వెంకట్రామి రెడ్డి . 5 పెండింగ్ డీఏలను రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేని సమయంలో కూడా ఒకేసారి ప్రకటించడంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉండే కొంతమంది అధికారులు, ఉన్నతాధికారుల వల్లే ప్రభుత్వానికి ,ఉద్యోగులకు విభేదాలు నెలకొన్నట్టు వెంకట్రామి రెడ్డి చెప్పారు. 



సానుకూల నిర్ణయం వచ్చినందున సమ్మె అవసరం లేదు : బొప్పరాజు వెంకటేశ్వర్లు ,అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు
 


ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తున్న పీఆర్సీ కమిటీ రిపోర్ట్‌ను ఉద్యోగులకు అందించడానికి ప్రభుత్వం అంగీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు అమరావతి ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. పీఆర్సీతోపాటు అనుబంధంగా ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని వాటి పరిష్కారం కోసం ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇక ఉద్యోగులు,పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను తిరిగి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న బొప్పరాజు పీఆర్సీ ఉద్యమాన్ని అర్దాంతరంగా ఆపేసినట్టు ఎవరూ భావించొద్దని కోరారు. తమ డిమాండ్ల పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమే అని రానున్న రోజుల్లో మిగిలిన డిమాండ్ల సాధన కోసం మరింత శ్రమిస్తామని సాటి ఉద్యోగులకు హామీ ఇస్తున్నట్టు బొప్పరాజు స్పష్టం చేసారు.


ఉపాధ్యాయ జేఏసీ మాత్రం ఈ చర్చలను తిరస్కరించింది. తాము ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించడం లేదని స్పష్టం చేసింది.