విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడిని కిడ్నాప్ శుక్రవారం కలకలం రేపింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన యువకుడిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. యువకుడిని కారులో ఎక్కించారు. అతని తలపై బలంగా కొట్టారు. బాధితుడి కుటుంబ సభ్యులను రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. యువకుడిని రహస్య ప్రదేశంలో ఉంచేందుకు ప్రయత్నించగా, యువకుడు కేకలు వేయడంతో స్థానికులు కిడ్నాపర్లను వెంబడించారు. ఈక్రమంలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెర్లాం మండలంలోని కూనాయవలసకు ఈశ్వరరావు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.
సాయం కోరి కిడ్నాప్
కోవిడ్‌తో కారణంగా గత రెండేళ్లుగా ఈశ్వరరావు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజూలానే మార్నింగ్ వాకింగ్‌కు రాజాం–రామభద్రపురం మెయిన్ రోడ్డుకు శుక్రవారం వెళ్లారు. కూనాయవలస పెట్రోల్ బంక్ దగ్గర్లో ఓ కారు ఆగిఉంది. కారు ఆగిపోయింది సాయం చేయాలని ఈశ్వరరావును ఓ వ్యక్తి కోరారు. కారు నెట్టేందుకు ఈశ్వరరావు ప్రయత్నించగా కారులో ఉన్న మరోవ్యక్తి దిగి ఈశ్వరరావు తలపై బలంగా కొట్టాడు. మరో ఇద్దరు కలిసి కాళ్లుచేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి కారులో బలవంతంగా ఎక్కించారు. కారులో ఈశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెవాలని యువకుడ్ని బెదిరించారు. లేదంటే అతని కళ్లు, కిడ్నీలు, ఇతర అవయవాలు అమ్మేస్తామని బెదిరించారు. కారులో యువకుడిని ధర్మవరం వరకు తీసుకెళ్లారు. అక్కడ ఓ రహస్య ప్రదేశంలో బంధించేందుకు ప్రయత్నించగా ఈశ్వరరావు గట్టిగా కేకలు వేశారు. అటుగా వెళ్తున్న ధర్మవరం గ్రామస్తులు అది గమనించి దుండగులలో ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంపై ఎస్.కోట పోలీసులకు సమాచారం ఇచ్చి కిడ్నాపర్లను అప్పగించారు. గాయపడిన యువకుడిని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.
స్వగ్రామం వ్యక్తి ప్రమేయం..!
ఈశ్వరరావు ఫిర్యాదుతో ఎస్‌ఐ తారకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ అయిన తెర్లాం మండలానికి కేసును బదిలీ చేశారు పోలీసులు. కిడ్నాపర్లు నలుగురిలో ముగ్గురు ఎస్.కోట మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు రేవళ్లపాలెం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు ఎస్.కోటకు చెందిన వ్యక్తి. ఈ ముగ్గురు రేవళ్లపాలెం గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ధర్మవరంలో నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. వీళ్లు ప్రతి రోజూ మద్యం సేవించి ప్లాంట్‌లోనే ఉంటారని ధర్మవరం గ్రామస్తులు అంటున్నారు. ఎవరైనా సుఫారీ ఇస్తే యువకులు ఈ పనిచేశారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కూనాయవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమోయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.