హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల విలీనం స్టాక్‌ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది! మెర్జింగ్‌ గురించి చెప్పిన రోజు నుంచీ వరుసగా ఈ రెండు కంపెనీల షేర్లు పతనం అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 10 శాతం వరకు నష్టపోవడంతో దాదాపుగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మార్కెట్‌ విలువతో సమానమైన సంపదను మదుపర్లు నష్టపోయారు.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ విలీనమవుతాయని ఏప్రిల్‌ 4న మేనేజ్‌మెంట్‌ ధ్రువీకరించింది. ఆ రోజు షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఆ మరుసటి రోజు నుంచి అసలు కథ మొదలైంది. ఈ రెండు కంపెనీల షేర్లు వరుసగా నష్టపోతున్నాయి. ఏప్రిల్‌ 4న రూ.9,18,591 కోట్లుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ విలువ వరుస విక్రయాలతో రూ.1.67 లక్షలు నష్టపోయి ప్రస్తుతం రూ.7,51,421 కోట్లకు చేరుకుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.91,595 కోట్లు తగ్గి రూ.4,85,692 కోట్ల నుంచి రూ.3,94,097 కోట్లకు చేరుకుంది.


ఏప్రిల్‌ 4న రూ.14 లక్షల కోట్లుగా ఉన్న ఈ రెండు కంపెనీల మార్కెట్‌ విలువ మంగళవారం నాటికి రూ.11.45 లక్షల కోట్లకు తగ్గిపోయింది.  అంటే మొత్తంగా రూ.2.58 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. ఇది బజాజ్ ఫిన్‌సర్వ్‌ మార్కెట్‌ విలువ రూ.2.51 లక్షల కోట్ల కన్నా ఎక్కువే కావడం గమనార్హం. అయినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ మార్కెట్‌ విలువ మూడో స్థానంలో ఉంది. రూ.17,81,205 కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి స్థానంలో ఉండగా రూ.12,89,011 కోట్లతో టీసీఎస్‌ రెండో స్థానంలో నిలిచింది.


హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనం చాలామందిని కంగారు పెడుతోంది. ప్రస్తుతం వీటి మార్కెట్‌ విలువ తగ్గిపోయినా రెండేళ్ల లక్ష్యంతో కొనుగోలు చేయొచ్చని కొన్ని బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి. మంగళవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు రూ.60 నష్టపోయి రూ.1335 వద్ద ముగిసింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ షేరు ధర రూ.123 తగ్గి రూ.2,140 వద్ద ముగిసింది.


Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌! 32 మందితో గ్రూప్‌ కాలింగ్‌, లార్జ్‌ ఫైల్‌ షేరింగ్‌


Also Read: వాట్సాప్‌ యూపీఐ వాడుతున్నారా? ఈ అప్‌డేట్‌ మీకోసమే!