మెటా నేతృత్వంలోని వాట్సాప్ (Whats App) తన పేమెంట్ సర్వీసులను విస్తరించేందుకు అనుమతి లభించింది. వాట్సాప్ యాప్ ద్వారా 10 కోట్ల మంది యూపీఐ చెల్లింపులు (UPI payments) చేసేందుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం 6 కోట్లుగా ఉన్న ఈ పరిమితిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 10 కోట్ల యూజర్లకు పెంచింది. సమయం గడిచే కొద్దీ వాట్సాప్ చెల్లింపులపై పరిమితిని ఎన్‌పీసీఐ తొలగిస్తోంది.
ఏళ్లు గడిచే కొద్దీ వాట్సాప్‌పై ఉన్న పరిమితిని ఎన్‌పీసీఐ తొలగిస్తోంది. 2020లో పేమెంట్ సేవలు ఆరంభించేందుకు వాట్సాప్‌కు ఎన్‌పీసీఐ అనుమతి ఇచ్చింది. అప్పట్లో కేవలం 2 కోట్ల మంది యూజర్లు మాత్రమే యూపీఐ సర్వీసులు వాడేందుకు అనుమతించింది. 2021, నవంబర్లో ఈ సంఖ్యను 4 కోట్లకు పెంచింది. ఇప్పుడు 10 కోట్లకు విస్తరించింది.
'వాట్సాప్ యూపీఐ సర్వీసు యూజర్ల సంఖ్యను మరో 6 కోట్లకు పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులతో వాట్సాప్ తన చెల్లింపుల సేవలను 100 మిలియన్ల మందికి విస్తరించుకోవచ్చు' అని ఎన్‌పీసీఐ తెలిపింది.
భారత్‌లో యూపీఐ పేమెంట్ సేవల కోసం వాట్సాప్ ఎన్నాళ్లుగానో ప్రయత్నించింది. రెండేళ్ల క్రితం వారికి అనుమతి లభించింది. ఇప్పటికి పది కోట్ల మంది యూజర్లు సేవలు ఉపయోగించుకొనేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం పరిమితిపై సడలింపులు వచ్చినా 50 కోట్ల మందికి ఈ సేవలను విస్తరించాలని వాట్సాప్ లక్ష్యంగా పెట్టుకొంది. మరోవైపు వాట్సాప్ తన యాప్‌లో కమ్యూనిటీస్ ట్యాబ్‌పై పనిచేస్తోంది. ఫోన్‌బుక్ కాంటాక్టులో లేని వారికీ సందేశాలు పంపించేలా మార్పులు చేస్తోంది.