WhatsApp Communities Feature: ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ (WhatsApp) యూజర్లకు మరో అప్‌డేట్‌ ఇచ్చింది. సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొంది. గ్రూప్‌ కాలింగ్‌ సంఖ్యను 32కు పెంచుతున్నామని వెల్లడించింది. అలాగే 2జీబీకి పైగా సైజున్న ఫైల్స్‌ను షేర్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది.


ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌ కాల్‌లో కేవలం ఎనిమిది మందిని మాత్రమే యాడ్‌ చేసేందుకు వీలుంది. 1జీబీ కన్నా తక్కువ పరిమాణం గల ఫైల్స్‌ను మాత్రమే షేర్‌ చేసుకొనేందుకు వీలుండేది. లేటెస్టుగా గ్రూప్‌లోని చాట్‌ను ఎప్పుడైనా డిలీట్‌ చేసుందుకు అడ్మినిస్ట్రేటర్‌కు అవకాశం ఇస్తోంది. ఆ డిలీట్‌ చేసిన సంభాషణ గ్రూప్‌ మెంబర్లలో ఎవరికీ కనిపించదని వాట్సాప్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.


'గ్రూప్‌ చాట్స్‌ను (Group chat) సులభంగా ఆర్గనైజ్‌ చేసేందుకు, సమాచారం సులువుగా కనుగొనేందుకు వీలుగా వాట్సాప్‌ను మేం అప్‌డేట్‌ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వేర్వేరు గ్రూపులను ఒకే కమ్యూనిటీ (Whats App community) కిందకు తీసుకురావచ్చు. ఉదాహరణకు ఒక పాఠశాలలో వేర్వేరు తరగతులకు వేర్వేరు గ్రూపులు ఉంటాయి. కానీ పాఠశాలలో చదువుతున్న పిల్లల తలిదండ్రులకు ఓవరాల్‌గా ఒకే కమ్యూనిటీ ఉంటుంది. అందులోనే అనౌన్స్‌మెంట్లు, ఇతర టూల్స్‌ అడ్మిన్స్‌కు అందుబాటులో ఉంటాయి' అని ఆ అధికారి తెలిపారు.


'వాట్సాప్‌ గ్రూపుల్లో మేం మరికొన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాం. రియాక్షన్స్‌, లార్జ్‌ ఫైల్‌ షేరింగ్‌, ఎక్కువ మందితో గ్రూప్‌ కాల్స్‌ వంటివి' అని మెటా ప్లాట్‌ఫామ్స్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ఓ పోస్టు చేశారు. 


ఇతర యాప్స్‌ వందలు, వేల మందితో చాట్స్‌ రూపొందించుకొనే అవకాశం ఇస్తున్నప్పటికీ తాము మాత్రం రోజువారీ జీవితాల్లో భాగమైన గ్రూపులకు సపోర్ట్‌ చేయడంపై ఫోకస్‌ చేస్తున్నామని వాట్సాప్‌ ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది.