నెల్లూరు కోర్టులో తనపై ఉన్న కేసుకు సంబంధించిన సాక్ష్యాలను దొంగతనం చేయడంపై వస్తున్న విమర్శలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనను బద్నాం చేసేందుకే ఈ పని చేసినట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చోరీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని ఆరోపణలు చేస్తున్నవారిని ఆయన కోరారు. తాను కూడా సీబీఐ విచారణను స్వాగతిస్తానన్నారు. కాకాణి వ్యాఖ్యలు పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గమే ఇలా దొంగతనం చేయించిందన్న రీతిలో ఉండటంతో ఇదో కొత్త వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైఎస్ఆర్‌సీపీని గెలిపించేందుకు కలసి పని చేస్తాం !
మంత్రిగా తొలిసారి నెల్లూరు జిల్లాకు వచ్చిన కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రెస్ మీట్ లో పార్టీలోని అంతర్గత కలహాలపై సమయస్ఫూర్తిగా ప్రకటనలు చేశారు ఎవరు ఏ పని చేసినా, ఎంత కష్టపడినా 2024లో వైఎస్ఆర్‌సీపీని తిరిగి అధికారంలోకి తేవడమే తమ లక్ష్యం అని చెప్పారు . అదే సందర్భంలో ఏ మూర్ఖుడు కూడా తన చేతులతో తన జీవితాన్ని పతనం చేసుకోవాలని అనుకోడని, దానివల్ల పార్టీకి నష్టం చేయాలని అనుకోడని చెప్పారు ఎవరు ఏం చేసినా 2024లో పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. రాజీలేకుండా కలసికట్టుగా పనిచేస్తామని అన్నారు.
అనిల్ అన్నదాంట్లో తప్పేముంది..?
తాను మంత్రి పదవిలో ఉన్నప్పుడు కాకాణి అందించిన సహకారానికి తాను డబుల్ ఇస్తానంటూ ఇటీవలే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కాకాణి స్పందించారు. అనిల్ డబుల్ సహకారం ఇస్తామన్నారు దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. మా సహాయ సహకారాలు మీడియాకు తెలియవు కదా అని అన్నారు. తామెప్పుడూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటామని, రెట్టింపు సహకారం ఇస్తామన్న మాటను తాను ఆహ్వానిస్తానని అన్నారు.
అది వ్యక్తిగత విషయం..!
కాకాణి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందలేదని అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాటలపై కూడా కాకాణి స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలపై తాను బయట డిస్కస్ చేయలేనని చెప్పారు. ఆహ్వానం అందలేదు అన్న విషయంలో చాలా కారణాలు ఉండొచ్చని, ఫోన్ సిగ్నల్ పనిచేయకపోవచ్చని, మెసేజ్ వెళ్లకపోవచ్చని అన్నారు.
అది సంఘవిద్రోహ శక్తుల పని..!
ఫ్లెక్లీల వివాదంపై కూడా మంత్రి కాకాణి స్పందించారు. ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు దాన్ని పెంచడానికి సంఘవిద్రోహ శక్తులు ప్రయత్నిస్తాయని, దాన్ని పెద్దది చేయాలని చూస్తాయని అన్నారు కాకాణి. అలాంటి వ్యవహారం జరిగి ఉండొచ్చని చెప్పారు. అనిల్ వెళ్లి కాకాణి ఫ్లెక్సీ చించరు, కాకాణి వెళ్లి అనిల్ ఫ్లెక్సీ చించరు కదా అని ప్రశ్నించారు.