పోలీసుల వేధింపుల వల్లే మృతి చెందాడని భావిస్తున్న సాయి గణేష్‌ ఆత్మహత్య సంఘటనపై బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిజనిర్థారణ కమిటీ నేడు ఖమ్మం రానుంది. సాయి గణేష్‌ ఆత్మహత్యకు గల కారణాలు, పోలీసుల వ్యవహారశైలి తదితర అంశాలపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలన జరపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడిని రగిల్చిన సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ లీగల్‌ సెల్‌ ఏం తేల్చుతుందనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.


సాయిగణేష్‌ ఆత్మహత్య విషయంలో ఆది నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కు మార్‌తోపాటు పోలీసుల వ్యవహారశైలిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ పోలీసులు ఏకపక్షంగా వారిపై కేసులు నమోదు చేశారని, ఇది సాయి గణేష్‌ విషయంలో కూడా జరగడం వల్ల అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరైనా చురుగ్గా వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయి గణేష్‌పైన పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


అయితే గతంలో సైతం కొందరు కాంగ్రెస్‌ నాయకులు, కుల సంఘాల నాయకుల విషయంలో కూడా జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా చర్చానీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ భర్త ముస్తఫాపై పీడీ యాక్ట్‌ నమోదు చేయడం, కుల సంఘాల నాయకుడు భద్రు నాయక్‌పై రౌడీషీట్‌ తెరవడం వంటి విషయాలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. కార్పోరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీ కొట్టి ముస్తపా తన భార్యను కార్పోరేటర్‌గా గెలిపించుకున్న అనంతరం అక్కడ అనేక గొడవలు చెలరేగాయి.


ఈ నేపథ్యంలోనే ముస్తపాపై పీడీ యాక్ట్‌ నమోదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతోపాటు రఘునాథపాలెం మండలంలో అక్రమ క్వారీలపై పోరాటం చేస్తున్న కుల సంఘాల నాయకుడు భద్రునాయక్‌పై రౌడీషీట్‌ నమోదు చేయడంతో గిరిజన సంఘాలు ఇప్పటికీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సాయిగణేష్‌ మరణంతో ఈ సంఘటనలపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశాలతోనే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడానికి ఈ సంఘటలనే ఉదాహారణలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మాత్రం ప్రతిపక్షాలకు దీటుగా ప్రతివిమర్శలు చేస్తున్నారు.


రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే.. టీఆర్‌ఎస్‌
మతాల మద్య చిచ్చు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే సాయిగణేష్‌ ఆత్మహత్యకు పురిగొల్పిందని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధుతోపాటు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. సాయి గణేష్‌ మృతికి సంబందించి ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని, అవసరమైతే సీబీఐ విచారణ చేయించాలని కోరుతున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు సాయి గణేష్‌ ఆత్మహత్య విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడిని పుట్టించిన సాయి గణేష్‌ మృతిపై బీజేపీ లీగల్‌ సెల్‌ ఎలాంటి విషయాలను వెలికితీయనుందనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.