Adani Stocks: అదానీ సామ్రాజ్యంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అగ్గి పెట్టినా, ఆ గ్రూప్‌ షేర్లకు క్రేజ్‌ తగ్గలేదు. 2023 మార్చి నెలలో,  5 మ్యూచువల్ ఫండ్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌ షేర్లలో షాపింగ్‌ చేశాయి, రెండు అదానీ కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేశాయి. ఆ స్టాక్స్... అదానీ పవర్ లిమిటెడ్ (Adani Power Limited), అదానీ విల్మార్ లిమిటెడ్ (Adani Wilmar Limited).


నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సమాచారం ప్రకారం... మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, మిరే మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ అదానీ పవర్ షేర్లను కొనుగోలు చేశాయి, UTI MF, HSBC MF అదానీ విల్మార్ కోసం షాపింగ్ చేశాయి.


అదానీ పవర్
మోతీలాల్ ఓస్వాల్ MF.. అదానీ పవర్‌లో 8 కోట్ల రూపాయల విలువైన 4,14,000 షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరు కోసం సగటున రూ. 193 ఖర్చు చేసింది. 


మిరే MF.. 74,000 షేర్లను కోటి రూపాయల ధరతో కొనుగోలు చేసింది. ఒక్కో షేరు కొనుగోలు ధర రూ. 135 గా ఉంది. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ 5,000 షేర్లను కొనుగోలు చేసింది.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg research) నివేదిక విడుదలైన 2023 జనవరి 24వ తేదీన, అదానీ పవర్ షేర్ ధర NSEలో రూ. 274.65 వద్ద ముగిసింది. 2023 మార్చి 1వ తేదీన ఇది రూ. 153.60 కు పడిపోయింది. ఆ తర్వాత తేరుకుని, 2023 మార్చి 31న రూ. 191.60 వద్దకు చేరింది.


అదానీ విల్మార్
UTI మ్యూచువల్ ఫండ్.. మార్చి నెలలో, అదానీ విల్మార్‌లో రూ. 7 కోట్లు ఖర్చు పెట్టి 1,80,000 షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును దాదాపు రూ. 389 ధర వద్ద సంపాదించింది. HSBC MF 3,000 షేర్లను కొనుగోలు చేసింది.


అదానీ విల్మార్ షేర్లు జనవరి 24, 2023న రూ. 572.65 వద్ద ముగిశాయి. 2023 మార్చి 1వ తేదీన ఈ స్టాక్ ధర రూ. 379.70 కాగా, మార్చి 31, 2023న రూ. 405.85 వద్ద ముగిసింది.


గురువారం (13 ఏప్రిల్‌ 2023) నాడు అదానీ పవర్ షేర్‌ ధర రూ.188.90 వద్ద, అదానీ విల్మార్ షేర్‌ ధర రూ. 410.65 వద్ద ముగిశాయి. వీటిలో మొదటిది మిడ్‌ క్యాప్‌ స్టాక్‌, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్‌లో భాగంగా ఉంది. రెండోది లార్జ్ క్యాప్ స్టాక్, నిఫ్టీ 100 ప్యాక్‌లో కొనసాగుతోంది.


MFల కొనుగోళ్లు-అమ్మకాలు
2023 మార్చి నెలలో.. ఇన్ఫోసిస్‌లో రూ. 2,500 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో రూ. 1,900 కోట్లు, HDFCలో రూ. 1,400 కోట్లు అదనంగా పెట్టుబడులు MFలు పెట్టాయి. అలాగే... అల్ట్రాటెక్ సిమెంట్స్‌ నుంచి రూ. 6,400 కోట్లు,  SRF నుంచి రూ. 5,400 కోట్లు, మ్యాక్స్ హెల్త్‌ నుంచి 4,400 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.


అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) ప్రచురించిన డేటా ప్రకారం.. 2023 మార్చి నెలలో ఈక్విటీ లేదా గ్రోత్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 20,534.21 కోట్లు వచ్చాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.