వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ప్రకటన కేవలం దృష్టి మరలించే చర్యగానే అభిప్రాయపడ్డారు మంత్రి కే. తారకరామారావు. గౌతమ్ అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను  BRS బయటపెట్టినందున.. దాని నుంచి దృష్టి మరలించేందుకు కేంద్రం ఇలా స్పందించిందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంటుకు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంపూర్ణంగా ఆపేదాకా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేసేదాకా, కేంద్రంపై బీఆర్‌ఎస్ నుంచి ఒత్తిడి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దానికి వెంటనే డెడికేటెడ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ గనులను కేటాయించి, కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


కేసీఆర్ ఒక్కమాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందే


వైజాగ్ స్టీల్ ప్లాంటుతో పాటు తెలంగాణ ప్రజల హక్కు అయిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గొడ్డలిపెట్టుగా మారిన  అదానీ బైలదిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కుట్రపూరిత వైఖరిని తాము బయట పెట్టిన నేపథ్యంలోనే కేంద్రం ఈ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా ..కేంద్రం కుట్రలు చేసిన  తీరు పైన భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుందన్నారు కేటీఆర్. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధిని చాటుకుంటూ.. మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొంటామని చేసిన ఒక్క ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం వెనక్కి తగ్గిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఒక్కమాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకునే దాకా, బయ్యారంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేసే దాకా కేంద్ర ప్రభుత్వం పైన నిరంతరం ఒత్తిడి పెంచుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు.


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో తాత్కాలికంగా ఆపాం- కేంద్రమంత్రి


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో తాత్కాలికంగా ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. వీటిపై RINL యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ తెలిపారు.


RINL విలువ రూ.3 లక్షల కోట్లు.. చూపించింది రూ.397 కోట్లు మాత్రమే- AP BRS


ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున AP BRS నేతలు వాయిస్ వినిపించారు. RINL విలువ రూ.3 లక్షల కోట్లు అయితే... వాళ్ళు చూపించింది రూ.397 కోట్లు మాత్రమే అని ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. RINL కు రూ.5 వేల కోట్లు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతకాళ్ళ మీద నిలబడేలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.