Adani Green Energy: ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani group)‌.. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులపై ఎంతో ఆసక్తి చూపిస్తోంది. ఆ ఆసక్తితోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌  (ఏజీఈఎల్‌) ఈక్విటీలో రూ.9వేల 350 కోట్ల పెట్టుబడి పెడుతోంది. నిన్న(మంగళవారం) జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో ప్రమోటర్లకు రూ.1480.75 షేరు ధరతో రూ.9వేల  350 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ వారెంట్లను జారీ చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.9,350 కోట్ల పెట్టుబడిని ఏజీఈఎల్​లో క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్ కోసం  ఉపయోగిస్తారని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌(ఏజీఈఎల్‌) ప్రమోటర్‌ కుటుంబీకులతోపాటు ఆర్డౌర్‌ ఇన్వెస్ట్‌మెంట్, హోల్డింగ్‌ లిమిటెడ్,  అదానీ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మొత్తం 6.31 కోట్ల వారంట్లను జారీ చేయనుంది.


అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy)ప్రమోటర్లకు ఒక్కో షేరుకు రూ.1480.75 చొప్పున రూ.9వేల 350 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ వారెంట్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫండ్‌ను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు అదానీ గ్రీన్‌ పేర్కొంది. అలాగే... 2030 నాటికి 45 గిగావాట్ల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఈ నిధులను కంపెనీ ఖర్చు చేస్తుంది. ఈ పెట్టుబడుల కారణంగా కంపెనీలో ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు 3.83 శాతం వాటా లభించనుంది. వచ్చే ఏడాది 1.2 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్ల గడువు తీరనుంది. ఇప్పటికే వీటి చెల్లింపులు లేదా రీఫైనాన్సింగ్‌కు కంపెనీ ప్రణాళికలు వేసింది. 19.8 గిగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకి అదానీ గ్రీన్‌ ఇప్పటికే ఒప్పందాన్ని పీపీఏ కుదుర్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 2030 నాటికి 45 గిగావాట్ల లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తుందని కంపెనీ తెలిపింది. 40 గిగావాట్ల అదనపు సామర్థ్యం కోసం 2 లక్షల ఎకరాల భూమిలో ప్రాజెక్టు ప్రారంభించనుంది. 40 గిగావాట్ల సామర్థ్యం సాధించేందుకు రూ.9350 కోట్ల అదనపు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించారు.


పునరుత్పాదక ఇంధనంలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా అవతరించే మార్గంలో ఉందని, అదానీ గ్రీన్ ఎనర్జీ విప్లవానికి నాయకత్వం వహిస్తోందని అదానీ గ్రూప్ చైర్మన్  గౌతమ్ అదానీ తెలిపారు. అదానీ కుటుంబం తీసుకున్న ఈ కీలకమూన నిర్ణయం... దేశం యొక్క స్వచ్ఛమైన ఇంధన కలను నెరవేర్చడానికి నిబద్ధతను చూపుతుందన్నారు.  దీని ద్వారా మనం సంప్రదాయ ఇంధన వనరులను దశల వారీగా తొలగించవచ్చని చెప్పారు. ఈ పెట్టుబడితో అదానీ గ్రీన్ ఎనర్జీ తన వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో  కచ్చితంగా విజయం సాధిస్తుంది.


మరోవైపు... ఈ పెట్టుబడి ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 3.833 శాతం ఈక్విటీ వాటాను ఇస్తుంది. ప్రమోటర్ పెట్టుబడుల వార్తలతో నిన్న (మంగళవారం)  అదానీ గ్రీన్  ఎనర్జీ షేరు 4.38 శాతం పెరిగి రూ.1,600 వద్ద ముగిసింది. గత నెలలో ఈ షేరు 70 శాతం లాభపడింది.