Singareni Elections 2023 Polling: సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన మరో సమరంలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. అదే స్థాయిలో హామీలు కూడా ఇచ్చాయి. ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో జెండా పాతాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తోపాటు వామపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ దిశగానే మొన్నటి వరకు ప్రచారం చేశాయి.
6 జిల్లాలు- 84 పోలింగ్ కేంద్రాలు
ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్‌లో 84 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అర్థరాత్రికి ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.
మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు
మొత్తం 39వేల 809 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ఎవరి షిప్టుల్లో వాళ్లు వచ్చి ఓట్లు వేస్తున్నారు. బెల్లంపల్లిలో ఐదు, శ్రీరాంపూర్‌లో 15 మందమర్రిలో 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్‌లో 9వేల 124 మంది ఓటర్లు ఉన్నారు. మందమర్రిలో 4వేల 876 మంది ఉన్నారు బెల్లంపల్లి 985 మంది ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరీ
సాధారణ ఎన్నికలకు మించిన రాజకీయం ఈ బొగ్గుగనుల్లో జరుగుతోంది. రాష్ట్రంలో అధికారమార్పిడీ జరిగినందున ఇక్కడ కూడా పట్టు కోల్పోకూడదని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. పట్టిన పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ వ్యూహాలు రచించింది. ఈ ఎన్నికల బరి నుంచి టీజీబీకేఎస్ తప్పుకుంది. మరోవైపు బీఆర్‌ఎస్ అనుబంధ సంస్థైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏఐటీయూసీకి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ రెండు సంఘాలు ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సంస్త ఐఎన్‌టీయూసీ పోటీలో నిలిచింది.
1998 నుంచి ఎన్నికలు
తెలంగాణలోని సింగరేణి గనుల్లో తరచూ జరిగే సమ్మెలను నివారించేందుకు 1998 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదట్లో రెండేళ్ల కాలపరిమితి ఉండేది. తర్వాత అదే నాలుగేళ్లకు పెంచారు. మళ్లీ 2017 నుంచి కేంద్రం ఆదేశాల మేరకు గుర్తింపు సంఘాల కాలపరిమితిని రెండేళ్లకే పరిమితం చేశారు. అయితే దీనిపై గెలిచిన గుర్తింపు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఆ కేసు విచారణలో ఉన్నందున 2021లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి.
నాలుగేళ్లా? రెండేళ్లా?
కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి నోటిఫికేషన్ మాత్రం రెండేళ్ల కాలపరిమితితోనే విడుదలైంది. దీనిపై భవిష్యత్‌లో గుర్తింపు సంఘాలు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది మాత్రం తేలాల్సి ఉంది.