White Hair : వయసుతోపాటు జుట్టు నెరవడం అనేది సహజమైన ప్రక్రియ. కానీ ఇటీవల చాలామందిలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచే తెల్ల వెంటుకలు రావడం ప్రారంభం అవుతుంది. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు తెల్లబడటం అనేది వయసు పెరిగింది అనేందుకు ఒక నిదర్శనంగా చెబుతూ ఉంటారు. ముసలి వయస్సులో జుట్టు పూర్తిగా తెల్లబడటం అనేది సహజమైనదే. ఇందుకు జుట్టు కుదుళ్లలో ఉండే మెలనోసైట్స్ ప్రధాన కారణం. ఇవి మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. మేలనిన్ అనేది మీ జుట్టు నల్లగా ఉంచేందుకు దోహదపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా మీ జుట్టు తెల్లబడుతుంది.


జుట్టు బలహీనమైనట్లు కాదు


జుట్టు తెల్ల బడితే మీ వెంట్రుకలు బలహీనమైనట్లు కాదు. మెలనిన్ ఉత్పత్తి కాకపోవడం ఒక్కటే కారణం. జుట్టు ఎదుగుదలకు కారణమయ్యే కెరటినో సైట్స్ ఎలాంటి ప్రభావానికి గురికావు. అయితే, జుట్టు నెరవడం అనేది ఒక్కొక్కరికి ఒక్కో వయస్సులో మొదలవుతుంది. కొంతమందికి 30 ఏళ్ల వయస్సులోనే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. మరి కొంతమందిలో 60 దాటినా కూడా జుట్టు తెల్లబడదు. దీన్నిబట్టి  జుట్టు  తెల్లబడటానికి వయస్సుతో సంబంధం లేదని చెప్పవచ్చు.


ఒక్కో దేశంలో ఒక్కోలా..


దాదాపు 90 శాతం మందిలో జుట్టు తెల్లబడేందుకు జన్యువులు కూడా కారణం. అయితే ఇప్పటికి కూడా జుట్టు తెల్లబడేందుకు ఏ జీన్స్ కారణం అవుతాయనేది పరిశోధకులు  గుర్తించలేకపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా జుట్టు తెల్లబడే సమస్య ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటుంది. ఉదాహరణకు తకేషియన్ జాతికి చెందిన ప్రజలకు 30 సంవత్సరాల నాటికే జుట్టు నెరవడం ప్రారంభమవుతుంది. ఆసియా ప్రజల్లో 30 సంవత్సరాలు దాటిన తర్వాత జుట్టు నెరుస్తుంది. ఆఫ్రికన్లలో 40 సంవత్సరాలు దాటిన జుట్టు నెరవడం కనిపించదు. అధ్యయనాల ప్రకారం.. 50 సంవత్సరాలు వచ్చేనాటికి జనాభాలో దాదాపు 50 శాతం మంది ప్రజలకు జుట్టు నెరుస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.


అనారోగ్యానికి సూచిక


జుట్టు తెల్లబడటం అనేది సహజ ప్రక్రియ అయినప్పటికీ, కొన్నిసార్లు ఇలా జరగడం కొన్ని ఆరోగ్య సమస్యలకు సూచిక అని కొన్ని పరిశోధనలు తేల్చాయి. వెంటుకలు తెల్లబడటం అనేది కొన్ని సందర్భాల్లో తీవ్ర అనారోగ్యానికి కూడా ప్రారంభ సూచిక అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందుకు తగ్గ ఆధారాలు సైతం పరిశోధకులు చూపిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు తెల్లబడటం అనేది గుండెకు సంబంధించిన వ్యాధులను సైతం గుర్తించేందుకు దోహదపడుతుందని ఈ మధ్యకాలంలో కొన్ని పరిశోధనలు తేల్చాయి.


గుండె సమస్యలకు సంకేతం?


ఇటీవల భారత దేశంలో జరిగిన ఒక పరిశోధనలో కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులోనే జుట్టు నెరిస్తే.. గుండె సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. 2012లో సైతం యూకే లోని పరిశోధకులు మెలనోసైట్స్ తగ్గిపోడానికి శరీరంలో జరిగే మార్పులే కారణమని పేర్కొన్నారు. శరీరంలోని ఆరోగ్యకర కణాలు నాశనం అవుతున్నాయని చెప్పేందుకు జుట్టు నెరవడమే ఒక ప్రధాన సూచిక అని తెలిపారు.


ఆందోళన వద్దు.. జాగ్రత్తలే ముద్దు


జుట్టు తెల్లబడినంత మాత్రాన్న గుండెపోటు వస్తుందని భయపడకండి. ఇది పరిశోధనలో ఒక అంశం మాత్రమే. దీన్ని ఇంకా శాస్త్రీయంగా రుజువు చేయాల్సి ఉంది. మీ వయసు 35 సంవత్సరాలు ఉండి.. జుట్టు వేగంగా నెరయడం ప్రారంభమైతే అప్రమత్తంగా ఉండండి. గుండె సంబంధిత వ్యాధుల  బారిన పడకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్, సిగరెట్లు మానేయండి. వ్యాయామం కూడా తప్పనిసరి.


Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.